ఎట్టకేలకు ఆర్టీసీ ఉద్యోగుల కోరిక నెరవేరింది. ఆర్టీసీ సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విలీనం మీద ప్రజలలో మిశ్రమ స్పందన వస్తోంది. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ సంస్థగా కాకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సేవలు ఎంతగానో మెరుగైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన కారణంగా, ఆ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగులు ఈ నిర్ణయం పట్ల ఎంతో ఆనందిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది. ఆర్టీసీ సంస్థ నష్టాలు – లాభాలు పక్కనపెడితే, ఆ సంస్థకు ప్రతి ఊర్లో ముఖ్యమైన ప్రాంతంలో స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థలాలు అన్నీ సంస్థ పేరిట కాకుండా ప్రభుత్వం పేరు మీదకు మారుతాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ స్థలాలను వేలం వేసి, ఆర్టీసీ బస్టాండ్ లను వేరే ప్రాంతానికి తరలించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. పైగా ఇక పై ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వినియోగించినా దానికి ఎటువంటి ఫీజులు ప్రభుత్వం చెల్లించవలసిన అక్కర్లేదు. ఇలా రకరకాల కారణాలతో ప్రభుత్వానికి కూడా ఈ విలీనం వల్ల మేలు జరుగుతుంది.
అయితే ఎటొచ్చి ప్రజల్లో మాత్రం ప్రభుత్వ సంస్థగా మారిపోయిన తర్వాత ఆర్టీసీ సేవలు నాసిరకంగా ఉంటాయేమో అన్న అభిప్రాయం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కావడంతో, దాని ఆర్థిక ప్రయోజనాలకు తమ భవిష్యత్తు ముడిపడి ఉండటంతో కాస్తోకూస్తో మంచి సేవలు అందించిన ఈ సంస్థ ఉద్యోగులు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోవడంతో మిగతా ప్రభుత్వ సంస్థ ల ఉద్యోగుల మాదిరిగా నిర్లిప్తంగా మారిపోతారు ఏమోనన్న భయం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
మొత్తం మీద ఇటు వంటి కారణాల చేత, ప్రజలతో ఆర్టీసీ విలీనం పట్ల కాస్త నిర్లిప్తత, మిశ్రమ స్పందన కనిపిస్తోంది.