ప్రభుత్వం ఏం చెబితే అది చెయ్యాలి. ఏ ఆదేశాలిస్తే వాటిని పాటించాలి. ఎందుకూ ఏమిటీ ఎలా లాంటి ప్రశ్నలు వెయ్యకూడదు. అభ్యంతరాలు ఏవైనా ఉన్నా బయటపెట్టకూడదు, అనుమానాలను నివృత్తి చేసుకోకూడదు! అచ్చంగానే ఉంది తెలంగాణ వ్యవసాయమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీరు. ఉప సర్పంచ్ లకు అధికారాలు పెంపు విషయంలో మొదట్నుంచీ కొంత గందరగోళం గ్రామస్థాయిలో ఉంది. ఓపక్క గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నా, వారి కంటే ఎక్కువ అధికారాలు ఉప సర్పంచులకు ఇవ్వడమేంటనే చర్చ జరుగుతోంది. దాన్ని బహిరంగంగా చాలా గ్రామాల సర్పంచులు వ్యతిరేకించిన పరిస్థితులూ చూశాం, కొందరు రాజీనామాలకు సిద్ధపడ్డ ఘటనలూ ఉన్నాయి. అయితే, ఉప సర్పంచులకు గౌరవం ఇవ్వాల్సందే అంటూ మంత్రి ఎర్రబెల్లి ఒకింత ఆగ్రహించి మాట్లాడారు.
30 రోజుల్లో ప్రత్యేక కార్యాచరణను తెరాస సర్కారు అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయన హన్మకొండలో నాయకులూ అధికారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచ్ లకు సమానంగా ఉప సర్పంచ్ లకు కూడా చెక్ పవర్ ఇవ్వాలనీ, ఇవ్వాలా వద్దా అని అందర్నీ ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరో ఏదో వాగుతుంటే ఆ మాటలే వింటారా అన్నారు. పంచాయతీ సెక్రటరీల కంటే ఉప సర్పంచులకే ఎక్కువ గౌరవం ఇవ్వాలనీ, ఈ విషయంలో సర్పంచులు ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవద్దన్నారు. అలా కాదని మాట వినని సర్పంచులను ప్రభుత్వ వ్యతిరేకులుగా భావించాల్సి ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. నిధుల విషయంలో తనకు మంత్రిగా ఏ తరహా అధికారాలు ఉంటాయో ఇక నుంచి సర్పంచులకు కూడా అవే అధికారాలు ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేసినా, వాటిని వడ్డించేది తానే అంటూ మంత్రి ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.
వారు చెప్పింది విననివాళ్లంతా ప్రభుత్వ వ్యతిరేకులు అయిపోతారా..? ఒక మంత్రి స్థాయిలో ఉండి సర్పంచులను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేయడం సరైంది కాదనే చెప్పాలి. ఉప సర్పంచులకు చెక్ పవర్ అంశం మీద ఇప్పటికీ చాలా గందరగోళం క్షేత్రస్థాయిలో ఉంది. దానిపై సర్పంచుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం మంత్రిగా ఆయన చెయ్యాలి. ఉప సర్పంచుల హోదా ఎందుకు పెంచుతున్నామో ఆయన వివరించాలి. ఆ బాధ్యత వదిలేసి… ఇలా వ్యాఖ్యానించడం సర్పంచుల్లో వ్యతిరేకతను పెంచినట్టే అవుతుంది.