శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధకులకు సవాల్‌గా మారిన ప్రాంతం. అక్కడి ప్రజలకు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో.. ఎంత రీసెర్చ్ చేసినా .. పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వాలు ఇంత వరకూ ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేకపోయాయి. తొలి సారి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. రూ. 50 కోట్లతో ఓ రీసెర్చ్ సెంటర్ ప్లస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఉద్దానం ప్రాంతంలోని పలాసలో 200 పడకలతో అది రూపుదిద్దుకోనుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తారు.
ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్… ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గత సర్కార్ పై ఒత్తిడి తీసుకు వచ్చారు. దాంతో గత సర్కార్ డయాలసిస్ పెషంట్లకు ఉచిత వైద్యం, గ్రామాలకు నీరు అలాగే.. పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేసింది. పవన్ కల్యాణ్ ఆక్స్ఫర్డ్ వైద్యులతో పరిశోధన కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూ. 50 కోట్లతో ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయించింది. సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఏ గ్రామానికి వెళ్లినా, ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతూంటారు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇప్పటివరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ కిడ్నీ సమస్యను అధిగమించాలంటే బయట ప్రాంతాల నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవటం ఒకటే మార్గమని నిపుణలు అంచనా వేశారు. దీంతో… శాశ్వత మంచినటి పథకానికి కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు తగ్గితే.. అది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అవుతుంది.