” 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలింది…” ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ప్రకటించారు. రెండు కాంట్రాక్ట్ సంస్థల నుంచి చంద్రబాబు, లోకేష్ కమిషన్లు తీసుకున్నారని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల ప్రకారం… రేపోమాపో కేసులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు రెండో తేదీన కూడా.. విజయసాయిరెడ్డి అన్న క్యాంటీన్లలో అవినీతిపై ట్వీట్ చేశారు. అప్పుడు కేవలం 2 లక్షలతో నిర్మించే అన్న క్యాంటీన్లను ఎన్నికలకు ముందుర ఆదరబాదరగా నిర్మించారని ఒక్కోటి 30-50 లక్షలు ఖర్చయ్యిందని లెక్కలు చెప్పారని ఆరోపించారు.
అన్న క్యాంటీన్లలో టీడీపీ నేతలు దోచుకున్నారని.. ఇందులో రూ. 150 కోట్ల స్కాం జరిగిందని.. అది వెలికితీసేందుకు ఈ క్యాంటీన్లను మూసివేశామని.. నిజాలు తేల్చి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దాదాపుగా నెల రోజుల పూర్తయిన తర్వాత మరో సారి అన్న క్యాంటీన్లపై.. ట్వీట్ చేశారు. ఈ సారి ఆగస్టు రెండో తేదీన చెప్పిన రూ. 150 కోట్ల అవినీతిని రూ. 53 కోట్లకు తగ్గించారు. అయితే.. అప్పట్లో అవినీతిని వెలికి తీస్తామని మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు వెలికి తీసినట్లుగా ప్రకటించేశారు. విచారణ తేలిందన్నారు. ఇక చర్యలు తీసుకోవడమే మిలిగిందన్నట్లుగా విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమై వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా… ప్రధానంగా… సాధారణ ప్రజల్లో అన్న క్యాంటీన్లపైనే చర్చ జరుగుతోంది.
మూసివేతపై ప్రజల్లో… అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి .. అన్న క్యాంటీన్ల ట్వీట్ హైలెట్ అవుతోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అసలు .. అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగిందనే… దానిపై విచారణ జరపమని… విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారు..? ఏ అధికారంతో విచారణ చేశారు..? ఏ ఆధారాలతో అవినీతి జరిగిందని ఫైనల్ చేశారు..? అవినీతిపై… చంద్రబాబు, లోకేష్‌లను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారనే సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి. వీటిపై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!