తెలంగాణ ప్రభుత్వం.. తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేయాలనుకుంటున్న… యాదద్రి ఆలయం రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. యాదాద్రి ఆలయ స్థంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను.. చెక్కారు. ఈ విషయం ఆలస్యంగా వచ్చింది. బయటకు తెలిసిన తర్వాత విపక్షాలు ఎందుకు ఊరుకుటాయి. ఏం సాధించారని ఆలయాలపై మీ చిత్రాలు చెక్కుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండి పడింది. ఇది రాచరికమా? ప్రజాస్వామ్యామా? అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ అంశాన్ని బీజేపీ ఎందుకు తేలిగ్గా తీసుకుంటుంది. ఈ తరహా రాజకీయాల్లో బ్రాండ్ అయిపోయిన రాజాసింగ్ రంగలోకి దిగారు. తక్షణమే ఆలయ స్థంభాలపై కేసీఆర్ చిత్రాలు తొలగించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే.. ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.
పురాతన ఆలయాలపై చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించిన అంశాలతో పాటు ఆ కాలపు నిర్మాణ రీతులు, అప్పట్లో వాడిన నాణేలు, వ్యవసాయ పద్ధతులు, ఆచరించిన ధర్మాలు, వినియోగించిన సాధనాలను రాతి స్తంభాలపై చెక్కడం ఆనవాయితీ. శతాబ్దాల కాలం నాటి చారిత్రక నిర్మాణాల గోడలు, రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాల కనిపిస్తూ ఉంటాయి. యాదాద్రి ఆలయంపై మాత్రం దానికి భిన్నంగా చేస్తున్నారు.ప్రధాన స్తపతి ఆనందసాయి నేతృత్వంలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈయన సినిమా ఆర్ట్ డైరక్టర్. రాతి స్తంభాలపై సంస్కృతి, సంప్రదాయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది.
ఈ అంశంపై రాజకీయ పార్టీలు ఏ మాత్రం..సహనంతో ఉండే అవకాశాలు లేవు. ముఖ్యంగా.. హిందూ పెటెంట్ తమకే ఉందని భావించే.. భారతీయ జనతా పార్టీ… నేతలు ఈ విషయంలో.. చేయాల్సినంత వివాదం చేసే అవకాశం ఉంది. సెంటిమెంట్ రగిలేంత వరకూ … ఈ విషయంపై ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుందో… త్వరగా.. మేలుకుని.. వాటిని తొలగించమని ఆదేశాలిస్తుందో.. వేచి చూడాలి..!