సాహో డివైడ్ టాక్‌కి ఎన్నో కారణాలు. ప్రేక్షకులు అంచనాలు పెంచుకుని రావడం ఓ కారణమైతే, తెలిసి తెలిసి సాహో టీమ్ చేసిన తప్పులు కొన్నున్నాయి. మరీ ముఖ్యంగా చివర్లో దర్శకుడు సుజిత్‌కి యూవీ క్రియేషన్స్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం మరింత మైనస్ గా మారింది. సినిమా నిడివి విషయంలో తన అభ్యంతరాన్ని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడట సుజిత్. కానీ యూవీ అతి ధీమా ప్రదర్శించింది. పాటలు సాహోకి అతి పెద్ద మైనస్‌గా మారాయి. ఈ పాటల విషయంలోనూ సుజిత్ కొన్ని అభిప్రాయాలు చెప్పాడట. కేవలం హిందీ వెర్షన్‌కి మాత్రమే పాటలు ఉండాలని, తెలుగులో వాటిని తీసేయాలని సూచించాడట. కానీ నిర్మాతలు వినలేదని తెలిసింది. పాటలు లేకపోతే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఏమాత్రం ఎక్కదని, ప్రభాస్ అభిమానులు బాగా నిరుత్సాహడతారని సుజిత్‌కి సర్దిచెప్పారట. నిజానికి తొలి ఫైట్ అవ్వగానే ప్రభాస్‌పై ఓ ఇంట్రడక్షన్ పాటని కూడా ప్లాన్ చేశారట. కానీ… ఆ పాట కథా గమనానికి అడ్డుతగులుతుందని భావించి రికార్డ్ చేయించినా సరే, చిత్రీకరించకుండా ఆపేశారట. ఆ రూపంలో చిత్రబృందానికి రెండు మూడు కోట్లు ఆదా అయినట్టే. ఈ సినిమాలలో తొలగించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని స్క్రిప్టు దశలోనే కత్తిరించాల్సింది. రాసుకున్న ప్రతీ సన్నివేశాన్ని తెరకెక్కించడం వల్ల సమయం, డబ్బు రెండూ వృధా అయ్యాయి. ఈ విషయంలో సుజిత్‌ది ఎంత తప్పు ఉందో, నిర్మాతలదీ అంతే తప్పు ఉంది. కానీ ఆ అపవాదను ఇప్పుడు సుజిత్ మోస్తున్నాడు. ఆ నష్టాల్ని యూవీ ఎదుర్కొంటోంది.