హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ ను కూల్చేసి, కొత్త భవనం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూల్చివేతలో భాగంగా ప్రస్తుత సచివాలయాన్ని బీఆర్కే భవన్ కు మార్చారు. దీంతో ఈ మధ్య వివిధ శాఖల షిఫ్టింగులకు సమయం సరిపోయింది. ఇప్పుడు మంత్రుల ఛాంబర్ల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. కూల్చివేత ఇంకా మొదలు కాలేదు కాబట్టి, ప్రస్తుతానికి ఉన్న సచివాలయానికే మంత్రులు వస్తున్నారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి, ఇక్కడే మంత్రులు ఉండే అవకాశం ఉంది. అయితే, రికార్డులు షిప్టింగులు జరగడంతో… ఇక్కడి సచివాలయంలో ఫర్నిచర్, గదులు దుమ్ము పట్టేసి ఉన్నాయని, ఇలా ఉంటే ఎక్కడ కూర్చోవాలనేది కొంతమంది మంత్రుల ఆవేదనగా తెలుస్తోంది!
బీఆర్కే భవన్ లో కొంతమంది మంత్రులకు పేషీలను ఇచ్చారు. ఆ భవనం ఫస్ట్ ఫ్లోర్లో 9 మంది మంత్రుల ఛాంబర్లు ఉంటాయి. అయితే, ఒకే ఫ్లోర్లో తొమ్మిది ఛాంబర్లు అనేసరికి మరీ చిన్నవిగా ఉంటాయనీ, వెంటిలేషన్ బాగా తక్కువగా ఉంటుందంటూ మంత్రులు ముందే పెదవి విరిస్తున్న పరిస్థితి ఉందని తెలుస్తోంది. బీఆర్కే భవన్ లో కూడా వాస్తు ప్రకారమే ఛాంబర్లు ఉండాలనేది కూడా కొందరు మంత్రులు అంటున్నారట! ఈ నెల 15 నాటికి పూర్తిగా షిప్టింగ్ జరిగిపోతుందని అధికారులు చెబుతున్నారు. కానీ, మంత్రుల పేషీల్లో ఇంతవరకూ ఎలాంటి పనులూ మొదలు కాలేదు. ఎక్కడి రికార్డులు అక్కడే పడుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ కేటాయించారు తప్ప, దానిలో మార్పులూ చేర్పులూ ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అబిడ్స్ లో ఉన్న ఆ శాఖ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిపోయారు. రోడ్లు భవనాల మంత్రి ప్రశాంత్ రెడ్డి… ఎర్రమంజిల్ లోని ఆ శాఖ ఆఫీస్ కి వెళ్లిపోయారు.
దీంతో మంత్రుల్ని కలవడానికి వస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కొంత గందరగోళ పడాల్సి వస్తోంది. పాత సచివాలయంలో ఫైళ్లు లేవు, అక్కడ కొందరు మంత్రులు కూర్చుంటున్నారు. తాత్కాలిక సచివాయలంలో ఇంకా ఛాంబర్లు లేవు, మంత్రులు ఆయా శాఖల ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి! దీంతో కొంతమంది మంత్రులు జిల్లాల పర్యటన పేరుతో సచివాలయానికి రావడం లేదు. రెండేళ్లపాటు తాత్కాలిక సచివాలయంగా బీఆర్కే భవన్ అంటే… కష్టమే అని మంత్రులు పెదవి విరుస్తున్నారని సమాచారం. అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ పక్కాగా చూసుకున్నాక కూల్చివేత పెట్టుకుంటే బాగుండేదేమో అని సన్నిహితులతో చెబుతున్న పరిస్థితి!