ఏపీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టి.. లక్షల మంది భవన నిర్మాణ కూలీలకు చుక్కలు చూపెడుతున్న ఇసుక కొరత తీరడం లేదు. ప్రభుత్వం కొత్త విధానం తెచ్చినా.. ఆన్ లైన్ ఇసుక బుకింగ్ ప్రారంభించినా… పది శాతం అవసరాలు కూడా తీరడం లేదు. స్టాక్ యార్డుల వద్ద రెండో రోజే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్ లైన్్లో ఇసుక బుక్ చేసుకుందామంటే… ఆ సైట్ చుక్కలు చూపిస్తోంది. డబ్బులు కట్టిన తర్వాత రిసీప్ట్లు కనిపించడం లేదు. రిసీప్ట్లు కనిపిస్తే… వాటిని తీసుకెళ్లిన వారికి.. ఎప్పుడు ఇసుక పంపిస్తారో సమాధానం చెప్పే వారు కరవయ్యారు.
రీచ్ ల నుంచి ఇసుకను ప్రభుత్వం డిపోలకు తరలించి .. అక్కడ్నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి సొంత రవాణా ఖర్చులతో ఇంటికి చేరవేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మూడు నెలల తర్వాత ఇసుక అందుబాటులోకి వచ్చిందని చాలా మంది ఇసుకను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. నో స్టాక్ అనే సందేశమే కనిపిస్తోంది. ఏదైనా స్టాక్ యార్డులో… నిల్వ కనిపిస్తే బుక్ చేసుకోవాలంటే.. సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెపాప్లిస వస్తోంది. కొత్త నిర్మాణమా .. పాత భవనానికి రిపేర్లా..?.. కొత్తవైతే ఎన్ని ఫ్లోర్లు, ప్లాన్ ఉందా.. అన్న వివరాల దగ్గర్నుంచి ఎంత విస్తీర్ణానికి ఎంత ఇసుక ఇస్తామో కూడా చెబుతుంది. ఒక్కోక్కసారి 20 టన్నులు మాత్రమే ఇసుక ఇస్తామని వెబ్ సైట్ చూపిస్తోంది. అన్నీ చేసి బుక్ చేసే సమయానికి స్టాక్ నాట్ ఎవైలబుల్ అని వస్తోంది.
ట్రాక్టర్ ఇసుక, రవాణా ఖర్చులు ..ఇలా ఎలా చూసుకున్నా… నాలుగైదు రోజుల పాటు తంటాలు పడితే…రూ. ఐదు వేలకు ట్రాక్టర్ ఇసుక లభించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆఫ్లైన్లో బ్లాక్ మార్కెట్లో… రూ. ఆరేడు వేలకే ఇస్తామంటూ… పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారులు… బేరాలు పెడుతున్నారు. వారికి సులువుగానే ఇసుక లభిస్తోంది. నేరుగా రీచ్ల నుంచి అక్రమంగా తవ్వుకుని.. లెక్కా పత్రం లేకుండా తీసుకొచ్చి ఇస్తున్నారు. దాంతోనే… పరిస్థితి మారిపోతోంది. అందుకే.. ఆన్లైన్లో ఇసుక అని.. ప్రభుత్వం ప్రచారం చేసినా.. ఇప్పటికీ ఆఫ్ లైన్ మాత్రమే… పని చేస్తోంది.