అమరావతి ముంపునకు గురవుతుందని.. వివాదం రేపిన మంత్రి బొత్స సత్యనారాయణ కొత్తగా.. అమరావతి అసలు రాజధాని కాదనే వాదన తెరపైకి తీసుకు వచ్చారు. రాజధానిగా గత ప్రభుత్వం గెజిట్ ప్రకటించలేదని… స్పష్టం చేశారు. జగన్ వంద రోజుల పాలనపై.. ప్రభుత్వం తరపున చేసినవి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన .. రాజధానిపై కొత్త వివాదం సృష్టించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. ఇతర నిర్మాణాల మాదిరే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని ప్రకటించారు. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి ఒక అడ్రస్ అంటూ లేకుండా చేశారని ఆరోపించారు. అమరావతిలో రాజధాని వద్దని గతంలో పవన్‌కల్యాణ్ చెప్పారని.. మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని ఉండాలంటున్నారని మండిపడ్డారు.
మంత్రి బొత్స వ్యాఖ్యలపై.. టీడీపీ నేత యనమల స్పందించారు. వైసీపీ వంద రోజుల పాలనపై చార్జిషీట్ పేరుతో పుస్తకం రూపొందించిన టీడీపీ.. విడుదల కార్యక్రమంలో.. బొత్స ఆరోపణలపై మండిపడింది. అమరావతిపై గెజిట్ లేదు అంటున్న బొత్స… అక్కడ కూర్చుని ఎందుకు పాలన సాగిస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని కాకపోతే జగన్ ఎందుకు సచివాలయంలో కూర్చుంటున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసింది తెలియదా అని మండిపడ్డారు. రాజధాని భవనాలను పాలనకు ఎలా వాడుతున్నారని ప్రశ్నించారు.
రాజధాని విషయంపై టీడీపీ నేతలు కూడా.. బొత్సపై విమర్శలు చేశారు. ప్రభుత్వం తీరునూ ప్రశ్నించారు. అయితే.. బొత్స ఇప్పుడు… ఆషామాషీగా గెజిట్ అంశాన్ని తెరపైకి తీసుకు రాలేదని… తర్వాత దీనిపై… కొన్ని పరిణామాలు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదని చెప్పి.. రాజధానిగా అమరావతిని గుర్తించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కోణంలో… ప్రస్తుత సర్కార్ ముందుకెళ్లే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.