నరసింహన్ గా గవర్నర్ ఉన్నంత కాలం… మంత్రివర్గ విస్తరణపై లీకులకే పరిమితమైన కేసీఆర్.. కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం చేసిన రోజునే.. ఆమెతో.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం పెట్టేశారు. కొత్త గవర్నర్ … హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లలో ఉండగానే.. ఆమెకు ఫోన్ చేసి… మంత్రివర్గ విస్తరణ సమాచారం ఇచ్చేశారు. ఉదయం గవర్నర్‌గా… తమిళిసై ప్రమాణం చేస్తారు. సాయంత్రం మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
కేటీఆర్, హరీష్ సహా ఆరుగురు కొత్త మంత్రులు..!
ఎవరెవర్ని మంత్రులుగా తీసుకోబోతున్నారన్నదానిపై.. కేసీఆర్.. వివరాలను రహస్యంగా ఉంచారు. అయితే.. కొన్ని పేర్లపై మాత్రం క్లారిటీ ఉంది. కేటీఆర్, హరీష్ లకు ఖాయమని చెబుతున్నారు. రెండో సారి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వీరిద్దర్నీ పక్కన పెట్టారు. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చినా.. హరీష్ కు పూర్తిగా ప్రాధాన్యం లేకుండా చేశారు. దాంతో పార్టీలో ముసలం ప్రారంభమయిందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా.. ఇద్దరికీ.. చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఇద్దరు మహిళలకు.. చాన్స్ ఇస్తామని.. అసెంబ్లీలోనే కేసీఆర్ ప్రకటించారు. మంత్రి పదవి హామీతో పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డికి ఖారరని చెబుతూండగా.. మరో అవకాశాన్ని ఎస్టీ మహిళకు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే రేఖా నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్లు పరిశీనలో ఉన్నాయి. ఖమ్మం నుంచి…పువ్వాడ అజయ్ కు ఖరారైనట్లుగా చెబుతున్నారు. సండ్ర వీరయ్య, ఆరూరి రమేష్ లాంటి వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ముగ్గురికి ఉద్వాసన ఖాయమే..!?
మంత్రివర్గంలో.. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అసంతృప్తి స్వరం వినిపించిన ఈటల రాజేందర్ ను.. పదవి నుంచి తప్పించే విషయంలో కేసీఆర్ పట్టుదలగా ఉన్నారంటున్నారు. అలాగే.. మల్లారెడ్డి, ఇంద్రకణ్ రెడ్డిలు కూడా.. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఉన్నారని చెబుతున్నారు. సామాజికవర్గాలన్నింటికీ అవకాశం కల్పించాలంటే.. కొత్త వారిని రెడ్డి సామాజికవర్గం నుంచి తీసుకుంటున్నందున.. కచ్చితంగా.. ఆ సామాజికవర్గం నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన చెప్పక తప్పని పరిస్థితి ఉంది.
పార్టీలో అసంతృప్తిని మొగ్గలోనే తెంచేయడమే లక్ష్యమా..?
కేసీఆర్ ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటన్నదానిపై.. టీఆర్ఎస్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ.. హరీష్‌కు సానుభూతి పెరుగుతున్న సూచనలు కనిపిస్తూండటం.. అదే సమయంలో… పార్టీలో అసంతృప్తికి గురైన వారంతా.. మెల్లగా ఆయన నాయకత్వం వైపు కుదులుతున్న సూచనలు రావడంతో.. అలాంటి వారందరికీ హెచ్చరికగా… హరీష్ ను.. కేబినెట్ లోకి తీసుకుని ఈటలకు ఉద్వాసన చెబుతారన్న చర్చ జరుగుతోంది. ఇంకెవరూ.. ధిక్కార స్వరం వినిపించకూడదన్న లక్ష్యంతో.. కేబినెట్ విస్తరణ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు.. అన్ని రకాల పదవులను వెంటనే భర్తీ చేస్తారన్న సమాచారం కూడా.. మీడియాకు ఇచ్చారు. దాంతో.. మంత్రి పదవులు లేకపోతే.. ఇతర పదవులు వస్తాయన్న ఆశతో.. ఇతర నేతలు సైలెంట్ గా ఉంటారని… కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
గవర్నర్ మార్పు కూడా కేసీఆర్ ను జాగ్రత్తపడేలా చేసిందా..?
బీజేపీ నేత తమిళిసై గవర్నర్ గా బాధ్యతలు చేపడుతున్నారు. మిషన్ తెలంగాణలో భాగంగానే ఆమెకు గవర్నర్ పోస్టు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలతే బీజేపీ చర్చలు జరుపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా రాజకీయాల గురించి కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉంది. అందుకే… ముందే జాగ్రత్తపడుతున్నార్న చర్చ జరుగుతోంది.