తమిళిసై రాజకీయ భవిష్యత్ ఉంటుందని పార్టీలు మారలేదు. తండ్రి కాంగ్రెస్ కీలక నేత. కాంగ్రెస్ దేశంలో తిరుగులేని స్థానంలో ఉన్న సమయంలోనే.. తన రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా బీజేపీనే ఎంచుకున్నారు. తమిళనాడులో బీజేపీకి మూలాలు లేవని ఎప్పుడూ నిరాశపడలేదు. ఇతర పార్టీల్లో చేరితే.. అవకాశం వస్తుందనే ఆలోచనలు చేయలేదు. నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడ్డ పార్టీకి.. ఆమె రాజకీయ లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా… పని చేశారు. నేటి తరం రాజకీయాల్లో తమిళిశై లాంటి నేతలు అరుదు..
తమిళిశై మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్స్ లీడర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. తన వాదన గట్టిగా వినిపించేవారు. తమిళనాడులో బీజేపీ వ్యతిరేకత చాలా ఎక్కువ. అయినప్పటికీ.. ఆమె ఎప్పుడూ తన వాదన వినిపించడంలోవెనుకడుగు వేయలేదు. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలవలేదు. అలాగని ఎప్పుడూ ఆమె నిరాశ చెందలేదు. అంతకు మించిన ఉత్సాహంతో… బీజేపీ కోసం పని చేశారు.
తమిళిశై ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూట్తోనే ఉంటారు. తెలంగాణకు ఆమెను బీజేపీ హైకమాండ్ ఓ ప్రత్యేకమైన రాజకీయ లక్ష్యంతోనే గవర్నర్ గా పంపారని.. ప్రచారం జరుగుతోంది. దానికి ఆమె రాజకీయ వ్యక్తిత్వం కూడా సరిపోతుంది. ఆమెకు బీజేపీ ప్రయోజనాలే ముఖ్యం. బీజేపీకి ఏది లాభమనిపిస్తే అది చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ కొత్త రాజ్యాంగాధిపతి … అసామాన్యంగా ఎదిగిన సామాన్యురాలు. స్ఫూర్తి నింపే రాజకీయ నేత. ఎలాంటి సందర్భంలో అయినా సిద్ధాంతాలకు… కట్టుబడి ఉండే వ్యక్తిత్వం. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు.. కేసీఆర్ ఆయనను పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా ఉండేలా చేసుకున్నారు. కానీ.. తమిళిసైతో మాత్రం..ఆ రాజకీయం అంత తేలిక కాదు..!