ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు.. నాయకులు ఒక్కొక్కసారి ఆవేశంలో నోరుజారి పెద్ద పెద్ద హామీలు ఇచ్చేస్తూ ఉండడం, అంతకంటె పెద్ద పెద్ద సవాళ్లు విసరడం చాలా సాధారణంగా జరిగే సంగతి. అయితే ఆ సవాళ్లకు ప్రతిసవాళ్లు వైరిపక్షాల వారు విసిరినా కూడా.. ఆ తర్వాత మళ్లీ స్పందించడం అంటూ ఉండదు. ఏదో నోరు జారి ఒక సవాలు విసిరాం.. మళ్లీ దాన్ని పెద్దది చేసుకోడం ఎందుకు అనే ధోరణిలో వెళ్లిపోతుంటారు. కానీ ఎంతైనా సీపీఐ నాయకుడు నారాయణ రూటే సెపరేటు. ప్రతిసవాలు రాగానే.. ‘నా సవాలుకు కట్టుబడి ఉన్నా..’ అంటూ మరింత రెచ్చిపోయారు. అందుకు పాపం.. ఇక మీదట ఆయన భాగ్యనగరంలో తన చెవిని దాచుకుని, దానికి ఒక ముసుగు వేసుకుని తిరగవలసిందేనేమో అని రాజకీయ వర్గాల్లో జోకులు వినిపిస్తున్నాయి.
తాము వంద స్థానాలు గెలుస్తాం అని తెరాస చెప్పుకుంటూ ఉంటే.. సీపీఐ నారాయణ వారి ధీమా మీద సెటైర్లు వేశారు. వంద సీట్ల సంగతి తరువాత… ఆ పార్టీ సొంత బలం మీద మేయర్ పీఠం మీదకు రాగలిగితే నేను నా చెవిని తెగ్గోసుకుంటా అని నారాయణ ప్రకటించారు. సికింద్రబాద్ బహిరంగ సభలో కేసీఆర్ నారాయణ సవాలును ప్రస్తావిస్తూ.. ‘నేను నారాయణకు సలహా ఇస్తున్నా.. ఎన్నికల రిజల్టు వచ్చే 5 వ తేదీన ఆయన నగరంలో ఉండకుండా ఎక్కడికైనా పోతే మంచిది. ఎందుకంటే మేం నెగ్గగానే జనం ఆయన ఎక్కడున్నారో వెతికి చెవి కోస్తారేమో’ అంటూ ఛలోక్తులు విసిరారు. వీటిపై నారాయణ మళ్లీ రెచ్చిపోయారు.
నేను ఎక్కడికీ వెళ్లను. ఇప్పటికీ నా సవాలుకు కట్టుబడే ఉన్నా.. ఫలితాలు వచ్చే 5వ తేదీన నగరంలోనే ఉంటా.. సొంత బలంపై వారు గద్దె ఎక్కేట్లయితే చెవి కోసుకుంటా.. మరి కేసీఆర్.. అలాంటి పరిస్థితి ఏర్పడక పోతే మెడ నరుక్కుంటారా అంటూ మరింత రెచ్చిపోయారు. అంటే తెరాస ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎం మద్దతుతో మాత్రమే గద్దె ఎక్కగలదు.. అంతే తప్ప.. సొంతంగా పీఠమెక్కేంత సీట్లు సాధించకపోవచ్చు అనేది ఆయన లో ఉన్న నమ్మకం.
కానీ పూర్తి ఫలితాలు వెల్లడి కాక ముందే తెరాస సొంత బలంతోనే పీఠమెక్కే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఇకమీదట నారాయణ నగరంలో తిరిగితే గనుక.. తన చెవిని ఎవరూ కోసేయకుండా.. దానికి ఒక ముసుగు తగిలించుకు తిరుగుతారేమో అని జనం జోకులు వేసుకుంటున్నారు.