ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పేరుతో క్వాలిటీ సంచుల్లో గట్టిగా మూట కట్టేసి ఇస్తున్న బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి చూసుకుని… శ్రీకాకుళం జిల్లా తెల్లకార్డు దారులు తెల్లబోతున్నారు. ముక్కిపోయి.. పురుగులు పట్టిన బియ్యాన్ని.. నాణ్యమైన బియ్యం అని పేరున్న సంచుల్లో వేసి.. గట్టిగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. అప్పటికి తెలియదు.. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మా బాధ్యత లేదని చెప్పుకోవడానికేమో కానీ… రేషన్ కార్డు దారులకు సరఫరా చేస్తున్న బియ్యం అంతా అలానే ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుని… మరీ ప్రారంభించిన సన్న బియ్యం పథకం.. చివరికి… అభాసు పాలయిందనే విమర్శలు వస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. తాను తినే బియ్యాన్నే… ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదలంతా తినేలా… రేషన్ కార్డులపై సరఫరా చేస్తానని… ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత కేబినెట్ లో.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. కానీ సమయం దగ్గర పడే కొద్దీ.. సన్నబియ్యం దొరకవరని తేలిపోయింది. దాంతో.. సన్నబియ్యం అనలేదని.. నాణ్యమైన బియ్యం అన్నామని చెప్పారు. సరే.. నాణ్యమైన బియ్యం పేరుతో .. స్వర్ణ రకం బియ్యారన్ని సరఫరా చేయాలనుకున్నారు. రాష్ట్రం మొత్తం పంపిణీ చేయడానికి అవి కూడా దొరకవని తేలిపోవడంతో… పైలట్ ప్రాజెక్టుగా.. ఒక్క జిల్లాకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. చిన్న జిల్లా అయిన శ్రీకాకుళంను ఎంచుకుని.. సెప్టెంబర్ ఒకటో తేదీన జగన్ సంచులు పంచి… పథకాన్ని ప్రారంభించారు. ఆ సంచులే నాణ్యతగా ఉన్నాయి. బియ్యంలో మాత్రం నాణ్యత లేదు.
మామూలుగా డీలర్ల వద్ద తీసుకుంటే.. రేషన్ బియ్యం… ఇలా ముక్కిపోయి.. పురుగులు పట్టి.. గడ్డలు కట్టి ఉండే అవకాశం లేదు. అలా ఉండే కార్డు దారులు తీసుకోరు. కానీ ఇప్పుడు ప్యాక్ చేసి ఇస్తున్నారు కాబట్టి… కచ్చితంగా తీసుకోవాల్సిందే. అందులో ఎలాంటి బియ్యం ఉన్నా తప్పదు. ఇంతోటి దానికి ఒక్కో బస్తాకు రూ. ఏడు , వాలంటీర్కు..నెలకు రూ.ఐదు వేలు అదనపు ఖర్చుతో… పథకాన్ని అమలు చేయడం ఎందుకో… సామాన్యులకు కూడా అర్థం కావడం లేదు. మొత్తానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలి పథకం మాత్రం.. ప్రజల్లో జగన్ పలుకుబడిని తగ్గించేసింది.