యాదాద్రి ఆలయంలో కేసీఆర్ శిల్పాలు, ప్రభుత్వ పథకాల గుర్తులు ఉండటంతో.. రేగిన వివాదం.. రాజకీయ దావాలనంలా మారుతూండటంతో.. తెలంగాణ సర్కార్ శరవేగంగా స్పందించింది. ఆలయాల్లో ఆ గుర్తులు ఉండటంపై.. ప్రజల్లోని ఏ వర్గం నుంచీ మద్దతు రాకపోవడంతో.. వెంటనే… వాటిని తొలగించాలని… అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాత్రికి రాత్రే వాటిని తొలగించేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ బొమ్మలు, ప్రభుత్వ పథకాల చిత్రాలు, గాంధీ , నెహ్రూ, కమలం, కారు, చార్మినార్ లాంటి బొమ్మలన్నింటినీ కూడా తొలగించేసినట్లుగా తెలుస్తోంది.
నిజానికి ఓ ప్రణాళిక ప్రకారమే.. ఆ బొమ్మలన్నింటినీ… శిల్పాలపై చెక్కారనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా.. వచ్చిన కవర్ చేసుకోవడానికి అన్నట్లుగా… గాంధీ, నెహ్రూ బొమ్మలు కూడా పెట్టారని చెబుతున్నారు. అయితే.. గాంధీ, నెహ్రూ బొమ్మలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ కేసీఆర్ చిత్రం ఉండటం మాత్రం తీవ్ర వివాదాస్పదమయింది. ఇప్పటికే కాసుకుని కూర్చుని ఉన్న బీజేపీ దీన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే… భావనతో.. దేశంలో ఉన్న పీఠాధిపతులందర్నీ పిలిపిస్తామని… రాజాసింగ్ ప్రకటించారు. వారం డెడ్ లైన్ పెట్టారు.
మరో వైపు వివాదాస్పద చిత్రాలు ఆలయంపై ఎందుకు పెట్టారన్నదానిపై…అధికారులు ఇచ్చిన వివరణ.. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంది. కేసీఆర్ ను ఒకరు రాజు అంటే.. మరొకరు దేవుడు అన్నారు. ఇలాంటివన్నీ.. తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. టీఆర్ఎస్ నేతలు కూడా… ఈ విషయాన్ని సమర్థించుకోలేకపోయారు. ఈ వివాదాన్ని అంతకంతకూ పెంచితే… అది రాజకీయంగా చేటు చేస్తుందని గుర్తించి.. వెంటనే.. తొలగింపునకు ఆదేశాలు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. మరి ఇంతటితో ఈ వివాదం ఆగుతుందా.. సాగుతుందా.. అనేది.. బీజేపీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.