తెలంగాణ కేబినెట్ హౌస్ ఫుల్ అయింది. రాజ్యాంగం ప్రకారం… ఉండాల్సిన పద్దెనిమిది మంది మంత్రులతో కేబినెట్ ఫుల్ అయిపోయింది. ఇప్పటి వరకూ 12 మంది మంత్రులు ఉన్నారు. తాజాగా.. ఆరుగురు ప్రమాణస్వీకారం చేయడంతో.. ఆ సంఖ్య 18కి చేరింది. దాంతో లెక్క సరిపోయింది. కొత్తగా… కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లతో… గవర్నర్ తమిళిసై సౌందరరాజన్… రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు.
వీరిలో కేటీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలోనూ మంత్రులుగా ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కేసీఆర్ చాలా పరిమితంగానే మంత్రివర్గాన్ని విస్తరించింది. మొదట ఒక్క మహమూద్ అలీతో మాత్రమే… ప్రభుత్వాన్ని నడిపిన ఆయన రెండు నెలల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించి మరో పది మందికి చోటు కల్పించారు. మళ్లీ ఏడు నెలల తర్వాత మిగతా ఖాళీలను భర్తీ చేశారు. కేటీఆర్ .. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఐటీ, పురపాలక శాఖలనే కేటాయించనున్నారు. హరీష్ కు మాత్రం.. ఈ సారి నీటి పారుదల కాకుండా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
పువ్వాడ అజయ్ ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి రెండో సారి గెలిచారు. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచినా… తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచే పోటీ చేసి గెలిచారు. ఖమ్మం నుంచి గెలిచిన ఒకే ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్లు తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇక కరీంనగర్ నుంచి గెలిచిన గంగుల కమలాకర్ గతంలోటీడీపీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మంత్రి కావడం ఇదే తొలి సారి. సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి.. మంత్రి పదవి హామీతోనే టీఆర్ఎస్‌లో చేరారు. వైఎస్ హయాంలో ఆమె మహిళా హోంమంత్రిగా పని చేశారు. ఇక సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాదు. గత ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ దక్కలేదు. టీడీపీ నుంచి ఆమె.. టీఆర్ఎస్ లో చేరారు. అయితే.. ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు.. నేరుగా మంత్రి పదవి అప్పగింంచారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ… కేబినెట్ లో మహిళలు మంత్రిపదవి చేపట్టలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా పురుష మంత్రులే నిర్వహించారు. దీనిపై విమర్శలు రావడంతో.. రెండు మంత్రి పదవులను.. మహిళలకు ఇస్తానని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దాని ప్రకారం… సబితా ఇంద్రారెరెడ్డి, సత్యవతిరాథోడ్ .. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.