తెలంగాణ కేబినెట్ లో కొత్తగా కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మంత్రులయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. దాదాపుగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది. ఎవరికైనా ఉద్వాసన పలుకుతారా.. అన్నదానిపై క్లారిటీ లేదు కానీ ఇప్పటికైతే ఇక కేబినెట్లో బెర్తులు ఖాళీ ఉండవు. ఇప్పటి వరకూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా..డిప్యూటీ సీఎంగా మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మంత్రులుగా ఉన్నారు.
విస్తరణకు ముందు సీఎం కేసీఆర్ కాకుండా కేసీఆర్ పది మంది మంత్రుల్లో రెడ్డి సామాజికవర్గం నుండి నలుగురు, వెలమ సామాజికవర్గం నుండి ఒక్కరు, బిసి సామాజికవర్గం నుండి ఇద్దరు, ఎస్సీ మాల సమాజికవర్గం నుండి ఒక్కరికి మంత్రిపదవులు దక్కాయి. ఇప్పుడు ప్రమాణస్వీకారం చేయబోతున్న ఆరుగురిలో ఇద్దరు వెలమ, ఒక కమ్మ, ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన వారున్నారు. అంటే.. మొత్తంగా కేసీఆర్ కాకుండా… వెలమ మంత్రులు ముగ్గురు,, రెడ్డి సామాజికవర్గం నుండి ఆరుగురు, బీసీల నుంచి ముగ్గురు, కమ్మ, ఎస్సీ మాల, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లుగా అయింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా తలపండిపోయిన వ్యక్తి. కేబినెట్ విస్తరణపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. సామాజికవర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం ఆధారంగా కేసిఆర్ గత కేబినెట్ లో టీంను ఎంపిక చేసుకున్నారు. అయితే కొంత మంది విషయంలో ఆయన ఒకింత అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఇంఛార్జిలుగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రుల విషయంలో కొంత కోపంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవర్నీ తొలగించే పరిస్థితి లేదని.. టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.