కొత్తగా చేరిన మంత్రివర్గంలో చేర్చుకున్న ఆరుగురు మంత్రులకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారుతున్న సమయంలో.. పథకాలన్నీ అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించాల్సిన పరిస్థితుల్లో.. కేసీఆర్.. హరీష్ రావుపై నమ్మకం పెట్టుకున్నారు. ఆయనకు ఆర్థిక శాఖ ఇచ్చారు. గత ప్రభుత్వంలో.. హరీష్ రావు.. నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. కేటీఆర్ కు.. గతంలో ఉన్నట్లుగానే… మున్సిపల్ , ఐటీ శాఖలను కేటాయించారు. సబితా ఇంద్రారెడ్డికి.. హోంశాఖను కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆమెకు విద్యాశాఖను కేటాయించారు. గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ, సత్యవతి రాథోడ్ కు… గిరిజన సంక్షేమం, మహిళా శిశుసంక్షేమ శాఖను కేటాయించారు. పువ్వాడ అజయ్‌కు రవాణా శాఖను ఇచ్చారు. ఇప్పటి వరకూ విద్యాశాఖను చూసిన జగదీష్ రెడ్డికి ఎనర్జీ శాఖను కేటాయించారు.
కేబినెట్ మొత్తం ఫుల్ అయినా… అత్యంత కీలకమైన నీటిపారుదల, రెవిన్యూ, జీడీఏ, ప్లానింగ్, మైనింగ్ లాంటి కీలకమైన శాఖలను ముఖ్యమంత్రి ఎవరికీ కేటాయించలేదు. నీటిపారుదల శాఖను హరీశ్ రావు సమర్థవంతంగా నిర్వహించిననా.. రెండో సారి పరిగణనలోకి తీసుకోలేదు. ప్రాజెక్టుల విషయంలో తాను స్వయంగా పర్యవేక్షించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలతో తెలుస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను శరవేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ భవిస్తున్నారు.
రెవిన్యూ శాఖను కూడా సీఎం తన వద్దే ఉంచుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి రెవిన్యూ శాఖను పూర్తి ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ అనధికారికంగా ప్రకటించడం, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుండటంతో… తానే డీల్ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోది. రెవిన్యూ శాఖను ఎలా ప్రక్షాళన చేయాలి? ఏఏ అంశాలు, నిబంధనలను కొత్త రెవిన్యూ చట్టంలో చేర్చాలి? ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా నిబంధనలను ఎలా రూపొందించాలన్న విషయాన్ని స్వయంగా కేసీఆరే చూస్తున్నారు. ఈ క్రమంలో.. ఫుల్ కేబినెట్ ఉన్నప్పటికీ.. కేసీఆరే అత్యంత కీలకంగా ఉండబోతున్నారు.