చదవేస్తే ఉన్న మతి పోయినట్లు అవుతోంది ఆంధ్రుల పరిస్థితి. బాగా చదువుకున్న వారు.. తెలివిగలవారు అని పేరు తెచ్చుకున్న ఆంధ్రులు.. ఇప్పుడు… కుల జాడ్యంతో.. దేశంలో కాదు.. ప్రపంచం మొత్తం పరువు తీసుకుంటున్నారు. తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేసింది. ఆంధ్రులపైకి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టింది. ఇప్పుడు.. ఏపీ సీఎం జగన్ అదే చేస్తున్నారు. అయితే అక్కడ రెచ్చగొడుతుంది.. ఓ సామాజికవర్గం వారిపై.
కులం క్యాన్సర్ ఏపీ యువతను కబళించేస్తోంది..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు… కులాల లెక్కలే ప్రధానం. అభివృద్ధి చేశాం.. సంక్షేమం పంచాం.. అంటే.. ప్రజలు పట్టించుకునే పరిస్థితి దాటిపోయింది. చదువుకున్న వారు పెరిగే కొద్దీ… తగ్గాల్సిన కులాల ప్రభావం.. విజ్ఞానం పెరిగే కొద్దీ పెరుగుతోంది. ఫలితంగా.. కుల రాజకీయాలే ఏపీలో కీలకమవుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా.. దీని చుట్టూనే తమ కార్యకలాపాలు ఉండేలా చూసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 శాతం ఓట్లు రావడానికి కులమే కారణం. ఓ సామాజికవర్గానికే.. గత ఐదేళ్లలో అన్ని అవకాశాలు అందాయని ప్రచారం చేసి.. ఆ సామాజికవర్గంపై ఇతరులందర్నీ రెచ్చగొట్టారని.. అందుకే… అలాంటి ఫలితాలొచ్చాయనేది.. చాలా మంది సామాజిక నిపుణుల విశ్లేషణ.
ఓ సామాజికవర్గంపై అందర్నీ రెచ్చగొడుతున్న పాలక పార్టీ..!
డీఎస్పీలందరూ చంద్రబాబు సామాజికవర్గం అనే దగ్గర్నుంచి ప్రారంభించిన వైసీపీ ఆరోపణలు… ప్రతీ విషయంలోనూ… అదే ప్రస్తావన తెచ్చేవారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు ఈ విషయంలో అసలు మొహమాట పడేవాళ్లు కాదు. అప్పటి వరకూ టీడీపీలో పదవులు అనుభవించి .. టిక్కెట్ల కోసం ఇతర పార్టీల్లో చేరే వాళ్లు కూడా…కులం కోణంలోనే ఆరోపణలు చేసి వెళ్లారు. చివరికి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఓ తూర్పుగోదావరి జిల్లా నేత కూడా.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి. అదే ఆరోపణలు చేశారు. అంతా ఓ ప్రణాళిక ప్రకారం… ఇలా సామాజిక రాజకీయం జరుగుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికవర్గ పరంగా చేసిన ఏ ఒక్క ఆరోపణనూ నిరూపించలేకపోయింది.
ఆంధ్రుల మేధావితనం గంగలో కలసిపోయినట్లే..!?
ఓ సామాజికవర్గంపై… ఇతరులను రెచ్చగొట్టడంతో పాటు… మిగిలిన సామాజికవర్గాల్లోని ప్రధాన నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ప్రధాన మద్దతుదారులైన సామాజికవర్గం నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్లోకి పార్టీ నేతల్ని చేర్చుకునే సమయంలో.. కేసీఆర్… తెలంగాణ కోసం పునరేకీకరణ అన్నారు. ఏపీలోనూ ఇప్పుడు అదే మాట వినిపిస్తోంది. ఏపీ రాజకీయ పరిస్థితుల్ని అక్కడ ఓ కులానికి వ్యతిరేకంగా.. అందరూ ఏకమవ్వాలన్న సందేశాన్ని పంపుతున్నారు. ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది.