తాము ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవడం లేదని..మొండిగా వ్యవహరిస్తున్నారని… ఓ కేంద్ర మంత్రి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఆ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి.. ఆర్కే సింగ్. కేంద్ర విద్యుత్ మంత్రి. ఆయన చేసిన వ్యాఖ్యలు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు పీపీఏల గురించి. పీపీఏల్లో అవినీతి అంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని..పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆర్కేసింగ్ మండిపడ్డారు. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. అంతులేని అవినీతి జరిగిందని.. తమ వద్దకు లేఖలతో… వైసీపీ ప్రభుత్వ పెద్దలు వచ్చారని.. అవినీతికి ఆధారాలు అడిగితే మాత్రం చూపించడం లేదని… అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో తాము ఎంత చెప్పినా జగన్ వినడం లేదని… అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. పీపీఏల విషయంలో… జగన్మోహన్ రెడ్డి వైఖరి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఎలాంటి అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేకపోయినా… తనంతట తాను.. అవినీతి జరిగిదంని నిర్దారించేసి.. ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి.. పీపీఏను రద్దు చేయడానికి సిద్ధమయ్యారు. అదే పనిగా విద్ుయత్ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. ధరలు తగ్గించాలని ఒత్తిడి చేశారు. వారు ధరలు తగ్గించకపోయే సరికి… కొనుగోళ్లు నిలిపివేశారు. ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లుగా నోటీసులు కూడా పంపారు. వీటిపై ఆయా సంస్థలు కోర్టులకు వెళ్లాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి దశలోనూ.. ఏపీ సర్కార్ ను హెచ్చరించింది. అయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. జగన్ వైఖరి వల్ల… సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోందని… ఆర్థిక మాంద్యం సమయంలో.. ఇలా జరగడం..దేశానికి తీవ్ర నష్టమని.. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. అదే అసహనాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.