తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి స్వరాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. కొన్ని సామాజిక పరంగా.. మరికొన్ని విధేయత పరంగా… సీఎం కేసీఆర్పై అసంతృప్తి వ్యక్తం చేసేవారు పెరిగిపోతున్నారు. టీఆర్ఎస్ -1 సర్కారులో డిప్యూటీ సీఎంగా ఉండి.. అనూహ్యంగా… బర్తరఫ్ అయిన తాటికొండ రాజయ్య… మొదటి సారి… అధికార పార్టీ తరపున… అసంతృప్తి గళం వినిపించి కలకలం రేపారు. కేబినెట్లో మాదిగలు లేకపోవడం బాధాకరమని … తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలు ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో మాదిగలు ఎక్కువ…ఏపీలో మాలలు ఎక్కువన్నారు. మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని అందుకే తాను మాట్లాడుతున్నానన్నారు. అదే విపక్షాలు మాట్లాడితే రాజకీయం అంటారని అందుకే.. అధికార పార్టీ నుంచి తాను మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.
కేబినెట్ కూర్పు తర్వాత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణకు.. ఉద్యమానికి అవకాశం లభించినట్లయింది. ఆయన తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మాదిగలను కేసీఆర్ అణగదొక్కుతున్నారని … మంత్రి పదవి ఇవ్వకుండా ద్వేషాన్ని పెంచుకున్నారని ఆరోపణలతో… రాజకీయ ఉద్యమం ప్రారంభించారు. కేబినెట్లో వెలమలకు 4.. మాదిగలకు మొండిచేయా అని ప్రశ్నించి..వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇతర బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలు కూడా.. ఇదే డిమాండ్ తో తెరముందుకు వస్తున్నారు.
మరో వైపు.. సీనియార్టీ పరంగా కూడా.. కేసీఆర్ కు నిరసన సెగ తగులుతోంది.తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాటతప్పారని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నా.. వద్దు కౌన్సిల్లో ఉండు.. మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టారని నాయిని చెప్పుకొచ్చారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారని..తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోందని..కానీ తనకు ఆపదవి వద్దని నాయిని స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్ పదవిలో రసం లేదన్నారు. కేసీఆర్ మా ఇంటికి పెద్ద, మేమంతా ఓనర్లమే.. కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో వాళ్లిష్టమని ఇటీవల పార్టీలోకి వచ్చి మంత్రి పదవులు దక్కించుకున్న వారినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ముసలం.. టీఆర్ఎస్ వెంటనే సద్దుమణుగుతుందా..లేక పెరుగుతుందా.. అన్నది కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను బట్టే ఉండనుంది.