ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో.. ఏపీ సర్కార్ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న తీరుతో… నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సిద్ధమైన సింగపూర్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏపీ సర్కార్ ముందుకు వస్తే సిద్ధమేనని… సింగపూర్ మంత్రి ప్రకటించారు. అయితే..అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ సర్కార్ సమీక్షించాలనుకుంటోందని… తమకు తెలిసిందన్నారు. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేతుల్లోనే అమరావతి భవిష్యత్ ఉన్నట్లు స్పష్టమయింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సీఆర్డీఏతో సింగపూర్ కన్సార్షియం ఒప్పందం చేసుకుంది. రాజధాని అభివృద్ధి చెంది, ఆదాయం సమకూర్చే వనరుగా మార్చేందుకు ‘స్టార్టప్ ఏరియా’ను ప్రతిపాదించింది.
కృష్ణానదీ తీరాన, సీడ్ యాక్సెస్ రహదారికి పక్కన, ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ నెలవుగా నిలవనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు అత్యంత చేరువలో దీన్ని ప్రతిపాదించింది. 1691ఎకరాల్లో అభివృద్ధి చేయదలచిన ఈ స్టార్టప్ ఏరియాను 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలిదశగా మూడేళ్లలో 656ఎకరాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచి, 8.07లక్షల చ.అ. బిల్డింగ్ స్పేస్ సృష్టించి, అందులో తమ శాఖలు- కార్యాలయాలు స్థాపించేలా సుప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించాలని ప్రణాళికలు రచించారు. సింగపూర్ కన్సార్షియంతో రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్పీవీలో సింగపూర్ కన్సార్షియానికి 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంటుంది.
మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసేందుకు అనుసరించిన స్విస్ చాలెంజ్ విధానం వివాదాస్పదం కావడంతో… ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందామని సింగపూర్ ఆగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రాజధానిపై ప్రభుత్వ దృక్కోణం మారింది. ఏపీ ఆర్దిక మంత్రి అధికారిక పర్యటన లో భాగంగా ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సింగపూర్ మంత్రి అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉందని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. అయితే.. రాజధానిలో అంతా అవినీతినే చూస్తున్న వైసీపీ.. సింగపూర్ కన్షార్షియంతో ఒప్పందం ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు.