కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ వీడతారు, భాజపాలో చేరతారు, కాంగ్రెస్ బహిష్కరణ కోసమే ఆయన ఎదురుచూస్తున్నారు అంటూ ఆ మధ్య చాలా కథనాలు వచ్చాయి. సొంత పార్టీ మీదే విమర్శలు చేయడం, షోకాజ్ నోటీసులు అందుకోవడం… అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు రాజగోపాల్ చర్చ చల్లబడిందీ అనుకుంటే… ఇవాళ్ల మళ్లీ ఆయన అసెంబ్లీ లాబీల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటోందన్నారు. రాష్ట్రంలో తెరాసకు ఎప్పటికైనా భాజపా ప్రత్యామ్నాయం అవుతుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో బాగుపడే పరిస్థితి లేదనీ, బాగుపడాలంటే ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలు వారి పదవులకు రాజీనామాలు చెయ్యాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలోనే సరైన నాయకత్వం లేదనీ, పార్టీ అధ్యక్ష పదవి వద్దంటూ రాహుల్ గాంధీ రాజీనామా చేసి వెళ్లిపోయాక ఎవరు మాత్రం ఏం చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలు పోరాటాలు చేసినా వినే పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేరన్నారు. పాదయాత్రలు కాదు, మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లినా కేసీఆర్ పట్టించుకోరన్నారు. తన సోదరుడు వెంకటరెడ్డి రైతుల సమస్యలపై పాదయాత్ర చేయడం మంచిదే అని కూడా చెప్పుకొచ్చారు! పార్టీ మార్పు గురించి మరోసారి స్పందిస్తూ… తాను మారడం వల్ల ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి లేదు కదా అన్నారు. పీసీసీ పదవి గురించి మాట్లాడుతూ… చేతులు కాలాక పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పుడెందుకు అంటూ విమర్శించారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు చర్చకు ప్రాధాన్యత ఎప్పుడో తగ్గింది. అయితే, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్లో పీసీసీ పదవిపై అసంతృప్తి వ్యక్తం మరోసారి అవుతోంది. పీసీసీ రేసులో కోమటిరెడ్డి సోదరులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి గ్యారంటీ అనే కథనాలు ఈ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పదవిపై ఇలా మాట్లాడారు రాజగోపాల్. ఉత్తమ్, కుంతియాల మీద గతంలో మాదిరిగానే మరోసారి ఆయన చేసిన విమర్శల్ని పార్టీ క్రమశిక్షణా సంఘం ఎలా పరిగణిస్తుందో చూడాలి? మరోసారి షోకాజో నోటీసు పంపిస్తారా? మరో అడుగు ముందుకేసి చర్యలు అంటారా..? నిజానికి, కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలపై ఇప్పటికే హైకమాండ్ కి చాలా ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా ఆయన విమర్శించారు కదా! స్పందన ఎలా ఉంటుందో చూడాలి.