ఆర్థిక మాంద్యం వచ్చేసిందని.. తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్ ను 35 వేల కోట్ల మేర తగ్గించేశారు. ఒకటి , రెండు సంక్షేమ పథకాలు మినహా మిగతా వాటికి కేటాయింపులు లేవు. ఆదాయాన్ని బట్టి కేటాయిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. ఇది తెలంగాణ పరిస్థితి … ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా లేదు. చెల్లించాల్సిన బిల్లులు తెలంగాణతో పోటీగా.. వేల కోట్లలోనే ఉంటాయని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆదాయం… దారుణంగా పడిపోయిందని… ఇటీవల ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఆదాయార్జన శాఖలన్నీ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి. ఆర్థిక మాంద్యం తోడు.. కొత్త ప్రభుత్వ నిర్ణయాల మాంద్యం కూడా ఏపీపై గట్టిగానే పడింది.
నిజమైన లెక్క ప్రకారం తెలంగాణ కన్నా ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణం..!
ఏపీ సర్కార్ ముందు అతి పెద్ద టాస్క్‌లు ఉన్నాయి. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా చెప్పుకునే మేనిఫెస్టోను ఈ నెలాఖరు నుంచే అమలు చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టోలో ఆదాయార్జన గురించి ఒక్కమాట కూడా లేదు. అంతా సంక్షేమం పేరిట డబ్బుల పంపిణీనే ఉంది. వాటికి సంబంధించి ఇప్పటి వరకూ జీవోలు విడుదల చేశారు. ఇక నుంచి ఆ పథకాల డబ్బులు ప్రజలకు పంపిణీ చేయబోతున్నారు. నెలాఖరులో ఆటో , క్యాబ్ డ్రైవర్లకు 400 కోట్లతో ప్రారంభించి రైతు భరోసాతో రైతులకు 12500, మత్య్సకారులకు పదివేలు, చేనేత మగ్గం ఉన్న వారికి 24వేలు, అమ్మఒడి పథకంతో ఒక్కొక్కరికి 15వేలు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు పదివేలు, పెళ్లికానుకతో లక్ష .. ఇలా వరుసగా… ప్రజలకు డబ్బులు పంచుకుంటూ వెళ్లాల్సిన పథకాలు ఏపీ ప్రభుత్వానికి లైనప్‌లో ఉన్నాయి. ఎలా చూసినా… ప్రస్తుతం వస్తున్న ఆదాయం.. చేస్తున్న అప్పులు కాకుండా.. అదనంగా మరో 40వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంటుంది.
పడిపోయిన ఆదాయం.. పెరిగిపోయిన ఖర్చులు..!
మరో వైపు ఆదాయం.. నిరంతరాయంగా పడిపోతూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల… ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో… వేల కోట్ల నగదు లావాదేవీలు ఆగిపోయాయి. ఆ ప్రభావం అంతటిపై పడింది. వర్షాలు ఆలస్యం కావడం.. ఈ లోపు మాంద్యం ముంచుకు రావడంతో.. ఏపీ సర్కార్ కు గడ్డు పరిస్థితులు తెచ్చి పెట్టాయి. ఏపీలో సంక్షేమ పథకాలు మాత్రమే కాదు.. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పేరుతో.. నాలుగు లక్షల మందిని కొత్తగా ఉద్యోగాల పేరుతో విధుల్లోకి తీసుకున్నారు. వీరికి.. ఎంత లేదన్నా… నెలకు వెయ్యి కోట్లకుపైగానే జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎంతైనా వెనుకాడబోమని… పథకాలు అమలు చేస్తామంటున్నారు.
జాగ్రత్త పడకపోతే.. ఏపీ “లెక్క” తప్పిపోతుంది..!
తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఆయన ఇప్పుడు ఆర్థిక మాంద్యం పేరుతో సంక్షేమానికి కోత విధించినా… ప్రజల నుంచి వచ్చే నిరసనను తట్టుకోగలరు. కానీ… ఏపీ సీఎంకు ఆ వెసులుబాటు లేదు. ఆయన అన్నీ చేస్తానని.. తాను ఉన్నానని.. తాను విన్నానని చెప్పుకుని అధికారం పొందారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం పేరుతో… తప్పుకునే పరిస్థితి లేదు. అలా అని ఖర్చు పెట్టడానికి నిధులూ అందుబాటులో లేవు. ప్రజల అంచనాలను అందుకోవడానికి… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు.. చిక్కుముడిలాంటి సమస్య.. ఇప్పుడు మాంద్యం రూపంలో వచ్చి పడింది. ఆదాయాన్ని తగ్గించుకునే చర్యలు తీసుకుని.. ఏపీ సర్కార్ మరింతగా ఇబ్బంది పడుతోంది. ఊహించని స్థాయిలో అప్పులైనా చేయాలి.. లేకపోతే.. చేతులైనా ఎత్తేయాలన్నట్లుగా పరిస్థితి ఉంది.