టీఆర్ఎస్ లో నేతలు తమ అంసతృప్తిని ఒక్కొరొక్కరుగా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విస్తరణకు ముందే పలువురు ఆశావాహులకు కేసిఆర్ ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల పదవులను ప్రకటించారు. నేడో రేపో డజనుకు పైగా కీలక కార్పోరేషన్ పదవులను భర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. చీఫ్ విప్ గా నియమితులైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మున్నూరు కాపు కోటాలో మంత్రి పదవిపై గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. ఆయన కేటిఆర్ కు అత్యంత నమ్మకస్తుడన్న పేరు కూడా సంపాదించారు. కానీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను అదృష్టం వెతుకుంటూ మరీ వరించింది.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కేటిఆర్ కు సన్నిహితంగా ఉన్న ఆయనకు కేబినెట్ లోకి తీసుకుంటామన్న హామీ లభించింది. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ను కేసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పైగా మల్లారెడ్డికి కేసీఆర్ తన తొలి కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చారు. తీవ్ర అసంతృప్తి లో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆదివారం జరిగిన విస్తరణ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఫోన్ తో పాటు, తన పిఏ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. బడ్జెట్ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఆయన బిజేపి నేతలతో టచ్ లో ఉన్నారని మల్కాజిగిరిలో జోరుగా చర్ఛ సాగుతోంది
కేసిఆర్ కేబినెట్ లో గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం, మంత్రులుగా పనిచేసిన జోగురామన్న, నాయిని నర్శింహారెడ్డికి కేసిఆర్ ఈ సారి మెండి చేయి చూపించారు. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు కు మంత్రి పదవి ఇచ్చి కడియం ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించారు. కనీసం కౌన్సిల్ చైర్మెన్ పదవైనా ఇస్తారనుకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గత కేబినెట్ లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన కు విస్తరణలో చోటు తప్పక కల్పిస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్ ఖాళీ చేయకుండా అవకాశం కోసం ఎదురు చూశారు. విస్తరణలో ఆయనకు కూడా కేసిఆర్ మొండి చేయి చూపడంతో ఆదివరం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్ ఖాళీచేసి. ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మారుతున్న పరిస్థితులతో తెలంగాణ రాజకీయం కూడా… ఎగ్రెసివ్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.