పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ వివాదాస్పద వైఖరితో… మొట్టమొదటగా.. అధికారులు బలవ్వబోతున్నారనే చర్చ.. ఏపీ సెక్రటేరియట్లో జోరుగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ… రేమండ్ పీటర్ కమిటీ నివేదికను అడ్డం పెట్టుకుని అధికారులు… నిబంధనలను పట్టించుకోకుండా… ఏపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడంతో… ఇప్పుడు అది వారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సీఎం ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వాలని పదే పదే కేంద్రం నుంచి పీఎంవో నుంచి లేఖలు వస్తున్నా… ఏపీ సర్కార్ కిక్కుమనడం లేదు. తెర వెనుక మాత్రం చాలా కథ నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
“రివర్స్” కోసం హద్దులు దాటేసిన ఏపీ అధికారులు..!?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కాంట్రాక్టులపైనే దృష్టి పెట్టింది. కాంట్రాక్టర్లందర్నీ తొలగించాలని నిర్ణయించుకుంది. ఎవరికి ఏ పనులు ఇవ్వాలో ముందుగా నిర్ణయించుకున్నారన్నట్లుగా.. పనులు చకచకా నడిచాయి. పోలవరం కాంట్రాక్టర్లను తొలగించడానికి అవినీతి అనే అస్త్రం వాడారు. రేమండ్ పీటర్ అనే ఓ మాజీ అధికారి నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని జగన్ నియమించారు. ఈ రేమండ్ పీటర్ జగన్ బంధువని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రెస్‌మీట్ పెట్టినప్పుడల్లా ఆరోపిస్తూ ఉంటారు. ఈ రేమండ్ పీటర్.. పోలవరంపై చకా చకా.. పరిశీలన జరిపి … అంతకు ముందు నుంచీ జగన్ చెబుతున్నట్లుగానే… పోలవరం హెడ్ వర్క్స్‌లో రూ. 1362 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చారు. అలాగే హైడల్ ప్రాజెక్టు కోసం ముందస్తుగా అడ్వాన్సులు చెల్లించారని కమిటీ పేర్కొంది. కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచించారు. సీఎం ఆదేశించారు. నిబంధనలు చూడకుండా.. అధికారులు జీ హుజూర్ అన్నారు.
మొట్టమొదటగా సమాధానం ఇచ్చుకోవాల్సింది అధికారులే..!
రేమండ్ పీటర్ నివేదికను.. జగన్ అమిత్ షా, షెకావత్ లకు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, జలశక్తి మంత్రిత్వ శాఖ అప్పటికే పోలవరంపై పూర్తి నివేదికలు రెడీ చేసుకుంది. ఆ రెండింటికి… జగన్ ఇచ్చిన నివేదికకు చాలా తేడా ఉంది. అవినీతి అని ఎలా చెప్పగలుగుతున్నారని.. ఆధారాలేవని… కేంద్రం అడిగితే.. నీళ్లు నమలడం.. ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల వంతు అయింది. ఎందుకంటే… గత ప్రభుత్వం హయాంలో.. పోలవరంలో.. ఎలాంటి అవకతవకలు లేవని… అంతా పర్ఫెక్ట్గా జరుగుతోందని.. నివేదికలు ఇచ్చింది అధికారులే. ఇప్పుడు అక్రమాలు ఉన్నాయని చెబుతున్నది ఆ అధికారులే. అందుకే.. కేందర్ం సీరియస్ అయింది. ఇప్పుడు ఎటు తిరిగి చుట్టుకోబోయేది … అధికారుల మెడకే అని.. క్లారిటీ వస్తోంది.
రేమండ్ పీటర్ హ్యాపీనే.. అసలు అధికారులకే బీపీ..!
ఏపీ సర్కార్ పై కేంద్రం మరోసారి సీరియస్ అయింది. రివర్స్ టెండర్లపై ప్రధానమంత్రి కార్యాలయం అడిగిన ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రోజులలో స్పందించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడా కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆధారాలు లేకపోతే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులకే చిక్కులు రానున్నాయి. ఎందుకంటే.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సినట్లుగా నివేదిక ఇచ్చిన రేమండ్ పీటర్‌కు.. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన అధికారిక కమిటీ కాదు. కానీ ఆ నివేదికను అడ్డం పెట్టుకుని… కాంట్రాక్టులు రద్దు చేయడం… కారణాలు లేకుండా.. అవినీతి అని వాదించడంతోనే అసలు సమస్య వస్తోంది. దీనికి అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి.