హైదరాబాద్: టీఆర్ఎస్కు 100 స్థానాలు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని టీడీపీ నేత రేవంత్ రెడ్డి, చెవి కోసుకుంటానని సీపీఐ నేత నారాయణ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ 100 స్థానాలకు చేరువైన నేపథ్యంలో వారిద్దరూ ఇప్పుడు తూచ్ అంటున్నారు. ఇవాళ ఒక న్యూస్ ఛానల్‌వారు ఆ నాయకులిద్దరితో లైవ్‌లో మాట్లాడారు.
100 స్థానాలు గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆరే సవాల్ విసిరారని, తాను సవాల్ విసరలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, టీడీపీ నుంచి ఎవరైనా తన సవాల్‌కు స్పందించాలని కేటీఆర్ అన్నట్లు రేవంత్ ఇవాళ వ్యాఖ్యానించారు. తాను సవాల్ విసరలేదని, కేటీఆర్ సవాల్‌కు ప్రతి స్పందించానని చెప్పారు.
మరోవైపు నారాయణ గ్రేటర్ సవాల్‌పై స్పందిస్తూ, రాజకీయాలన్న తర్వాత ఫ్లోలో ఏదో మాట్లాడుతుంటామని, వాటిని సీరియస్‌గా తీసుకోగూడదని చెప్పారు. తన సవాల్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలని అన్నారు. ఇదిలాఉంటే తెలంగాణ భవన్ దగ్గర సంబరాలు జరుపుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి, నారాయణలపై మండిపడ్డారు. రేవంత్ నల్లమల అడవులకు వెళ్ళిపోవాలని, నారాయణ చెవికోసుకోవాలని డిమాండ్ చేశారు.