ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వరకూ తెలుగుదేశం పార్టీ నేతలందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు. ఆ నేతలు ఇంట్లో ఉంటే హౌస్ అరెస్టులు.. లేకపోతే.. ఎక్కడ ఉంటే.. అక్కడే దిగ్బంధించారు. బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. చివరికి.. నారా లోకేష్.. ఉండవల్లి నివాసం నుంచి బయటకు వచ్చి.. కార్యకర్తలతో మాట్లాడి.. కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా.. పోలీసులు నిలిపి వేశారు. ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు దగ్గర్నుంచి.. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వరకూ.. ప్రతి ఒక్కర్నీ పోలీసులు నిర్బంధించారు. కొంత మందిని… ఇతర ప్రాంతాలకు తరలించారు. తెలుగుదేశం పార్టీ నేతలు.. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో… ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న ఉద్దేశంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించారు.
చలో ఆత్మకూరుపై పోలీసుల ఉక్కుపాదం..!
పల్నాడులో.. టీడీపీ సానుభూతిపరులపై.. వైసీపీ నేతలు దాడులు చేశారని.. వారి ఆస్తులు ధ్వంసం చేసి.. ఊరి నుంచి తరిమేశారని.. ఆరోపిస్తూ… తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఓ శిబిరం ఏర్పాటు చేసింది. బాధితుల్ని.. వారి వారి సొంత గ్రామాలకు తీసుకెళ్లేందుకు… చలో ఆత్మకూరు కార్యక్రమం ప్రకటించింది. టీడీపీ నేతలందరూ.. బాధితుల్ని వారి స్వగ్రామాలకు తీసుకెళ్లి.. భయం లేకుండా జీవించేలా భరోసా ఇచ్చి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పల్నాడుకు.. అలా వెళ్లడం… ఉద్రిక్తలకు కారణమవుతుందని పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే.. ఇది పల్నాడుకే పరిమితం. కానీ పోలీసులు.. ఏపీ మొత్తం .. టీడీపీ నేతల్ని నిర్బంధించారు.
బాధితుల శిబిరానికి ఆహారమూ వెళ్లనివ్వని పోలీసులు..!
మరో వైపు బాధితుల శిబిరం వద్ద పోలీసులు మోహరించారు. ఎవర్నీ లోపలికి వెళ్లనీయడం లేదు.. రానీయడం లేదు. చివరికి బాధితులకు ఆహారం తీసుకెళ్తున్న వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో.. వారికి నిన్న రాత్రి భోజనం, ఉదయం ఆహారం అందలేదు. పోలీసుల నిర్బంధం… బాధితులకు కనీసం భోజనం కూడా అందనీయకుండా చేస్తున్న వైనంపై.. టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పన్నెండు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. దారుణంగా..నిర్దయగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుత నిరసనలకను అడ్డుకోవడం .. ప్రజాస్వామ్యం కాదన్నారు.
12 గంటల నిరాహారదీక్ష ప్రారంభించిన చంద్రబాబు..!
హౌస్ అరెస్టులతో… టీడీపీ నేతలు ఆగిపోయే పరిస్థితి లేదని… చలో ఆత్మకూరును ఎలాగైనా విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… పోలీసులు ఎప్పుడు పట్టు సడలిస్తే.. అప్పుడు బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపు.. వైసీపీ దాడుల బాధితులకు సంఘిభావం తెలిపేందుకు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు… సంఘిభావ దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.