మంత్రివర్గ విస్తరణతో ఒక్కసారిగా కొంతమంది తెరాస నేతల్లో అసంతృప్తులు బయటపడ్డ సంగతి తెలిసిందే. మంత్రి పదవులు ఆశించిన నాయకులంతా పార్టీ మీద అసంతృప్తి వెళ్లగక్కారు. కొందరు నాయకులైతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగనిస్తే ఇదో సమస్యగా మారే అవకాశం ఉంటుంది కదా! అందుకే, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. మంత్రి పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్న ఒక్కో నాయకుణ్నీ కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. వీలైతేనే నేరుగా వారితో మాట్లాడటం, లేదంటే వారిని ప్రగతి భవన్ కి పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
మాజీ డెప్యూటీ సీఎం రాజయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ తో మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడినట్టు సమాచారం. మంత్రి వర్గ సర్దుబాటు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిందనీ, సమీప భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని రాజయ్యకు కేటీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే, వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి… సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడుచుకుంటా అంటూ స్వరం మార్చేశారు. అదేంటీ మొన్ననే కదా అసంతృప్తి వ్యక్తం చేశారూ అంటే… పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు వీడియోలుగానీ ఆడియోలుగానీ ఆధారాలున్నాయా అంటూ ఉల్టా ప్రశ్నించారు! గండ్ర వెంకట రమణారెడ్డి కూడా ఇలానే… కేసీఆర్ ఆశీస్సులతోనే తన కుటుంబానికి జెడ్పీ ఛైర్మన్ పదవి దక్కిందనీ, తాను పార్టీ మీద ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని, మీడియాలో వచ్చినవన్నీ కట్టుకథనాలని తేల్చేశారు!
ఆరికెపూడి గాంధీ ఫోన్లో అందుబాట్లో లేకపోతే… బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి తీసుకుని రమ్మంటూ సన్నిహితులకు పురమాయించారట! అక్కడ కలిసిన కేటీఆర్… పువ్వాడ అజయ్ కి ఎలాంటి పరిస్థితుల్లో పదవి ఇవ్వాల్సి వచ్చిందో వివరించి, భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లిన జోగు రామన్న కుటుంబంతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఆ వెంటనే… రామన్నకు బీపీ బాగా ఎక్కువైంది, అందుకే డాక్టర్లు రెస్టు తీసుకోమన్నారు, అంతేగానీ పార్టీ మీద అసంతృప్తి కాదు అంటూ స్పందించేశారు. మాజీ మంత్రి జూపల్లి కూడా ప్రెస్ మీట్ పెట్టి… పదవుల కోసం తాను ఆశించలేదనీ, ప్రజాసేవలో ఉంటానని కూడా అన్నారు. ఆయనకీ ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చిందని అంటున్నారు. అసంతృప్తుల్లో ఒక్క నాయిని నర్సింహారెడ్డి మినహా… మిగతా అందరికీ బుజ్జగింపులు జరిగిపోయినట్టు తెలుస్తోంది. నాయిని మాత్రం ఇంకా మాట వినడం లేదనీ, ఆయన స్పందనలో మార్పు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.