తెలంగాణకి కొత్త గవర్నర్ గా తమిళిసై బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో మాదిరిగానే… ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్రాల్లో అధికార పార్టీలకు అనుకూలంగా మాత్రమే గవర్నర్ వ్యవహరిస్తారు అనే విమర్శ తప్పేట్టు లేదు. నర్సింహన్ గవర్నర్ గా ఉండగా ఆయనకి ఇదే ముద్ర పడింది. సీఎం కేసీఆర్ కి అనుకూలంగా ఉంటారనీ, ప్రతిపక్షాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు తమిళసై విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అదే తరహా విమర్శలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్టుగానే గవర్నర్ మాట్లాడుతున్నట్టుగా ఉందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని గవర్నర్ మెచ్చుకున్నారనీ, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమంటూ ఆమె వ్యాఖ్యానించారనీ, ఇలాంటి మాటల వల్ల కేసీఆర్ అవినీతికి కూడా వారు మద్దతు ఇస్తున్నట్టుగా ఉందని రేవంత్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన సమాచారం మేరకే గవర్నర్ ఇలా మాట్లాడుతున్నారా, లేదంటే భాజపా నేతల స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిపోయిందని రాష్ట్ర భాజపా నేతలు ఆరోపిస్తున్నారనీ, నిన్నమొన్నటి వరకూ తమిళనాడులో భాజపా నాయకురాలిగా ఉంటూ వచ్చిన గవర్నర్… ఇప్పుడా ప్రాజెక్టు అద్భుతం అంటున్నారన్నారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ గానీ, ఇతర నాయకులుగానీ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ అన్నారు. తెరాస భాజపాలు కలిసి పనిచేస్తున్నాయనీ, చీకట్లో వాళ్ల దోస్తీ ఉందనీ బయటకి మాత్రమే ఈ కుస్తీ నాటకాలనీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయనీ, త్వరలోనే గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.
కొత్త గవర్నర్ కి ఇక్కడి రాజకీయ పరిస్థితులు సవాల్ గానే కనిపిస్తున్నాయి. అధికార పార్టీ విధానాల మీద తరచూ గవర్నర్ దగ్గరకి ఫిర్యాదులు తీసుకెళ్లడం, స్పందించకపోతే గవర్నర్ మీద విమర్శలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచీ ఉన్న అలవాటే. ఇప్పుడు కొత్తగా, గవర్నర్ ని భాజపా ప్రతినిధిగా చూపించే ప్రయత్నం చేస్తూ, రాష్ట్రంలో ఆ పార్టీని ఎదుర్కోవడానికి ఇదో అస్త్రంగా మార్చుకునే ప్రయత్నమూ చేస్తారు. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అనుకూలంగానే గవర్నర్ ఉంటారు కాబట్టి, దాన్ని కూడా హైలైట్ చేస్తూ విమర్శలు చేస్తారు. రేవంత్ ప్రయత్నంలో ఆ వ్యూహం కూడా కనిపిస్తోంది.