ఎస్పీ ఎదుట లొంగిపోతున్నా…! .. అని మీడియాకు ఫోన్లు చేసి మరీ చెప్పిన చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. చింతమనేని లొంగిపోవడం అంటే.. తమకు అవమానం అని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే… గత పది రోజులుగా.. చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు దాదాపుగా పది బృందాలు .. ఇంకా చెప్పాలంటే.. పోలీసు యంత్రాంగం మొత్తం సర్వశక్తులు ఒడ్డింది. చింతమనేని ఇల్లు మాత్రమే కాదు.. ఆయన బంధువులు సహా అనుమానం ఉన్న ప్రతీ చోటా… సోదాలు చేశారు. కానీ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాష్ట్రం దాటిపోయారని పోలీసులు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది.
ఈ లోపే మంత్రి బొత్స సత్యనారాయణ.. చింతమనేనిపై విమర్శలు చేశారు. తప్పు చేశారు కాబట్టే ఆజ్ఞాతంలోకి వెళ్లాడని.. మంత్రి బొత్స వ్యాఖ్యానించడంతో… ఈ విమర్శలను సవాల్ గా తీసుకున్న చింతమనేని.. మీడియాకు ఫోన్ చేసి.. తాను లొంగిపోతున్నానని ప్రకటించారు. అంతే కాదు.. తనపై పెట్టింది తప్పుడు కేసు అని నిరూపితమైతే.. మంత్రి పదవికి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అదే తాను తప్పు చేసినట్లు నిరూపితమైతే.. యావదాస్తి రాసిచ్చి.. రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. మీడియాకు ఫోన్లు చేసి మరీ చింతమనేని సవాల్ చేసి.. ఎస్పీ ఎదుట లొంగిపోతానని చెప్పడంతో… పోలీసులు హడావుడి పడిపోయారు. చింతమనేని స్వగ్రామంలో ఉండి ఉంటారనుకుని.. ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
దుగ్గిరాల గ్రామంలో చింతమనేని ఇంట్లో పోలీసులు సోదాలు చేసి.. గందరగోళం సృష్టించారు. కుటుంబసభ్యులను లాగి పడేశారు. ఇంట్లో చిందరవందర చేశారు. ఈ సమయంలో చింతమనేని అనుచరులు అడ్డుపడ్డారు. లొంగిపోతానని.. చింతమనేని సమాచారం ఇచ్చినా ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం.. చింతమనేని ఇంటిదగ్గరే మోహరించి ఉన్నారు. చింతమనేని లొంగిపోక ముందే అరెస్ట్ చేయాలన్న పట్టుదలతో పోలీసులు ఉన్నారు. ఆయన లొంగిపోయారనే మాట కన్నా.. తాము పట్టుకున్నామన్న ఇమేజ్ కోసమే.. పోలీసులు ప్రయత్నిస్తోంది. కొసమెరుపేమిటంటే… చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారంటూ.. ముగ్గురు యువకుల ఫిర్యాదు చూపిన పోలీసులకు.. వారిలో ఇద్దరు షాక్ ఇచ్చారు. అసలు చింతమనేని… ఆ రోజు ఘటన దగ్గరకే రాలేదన్నారు.