ఎప్పుడూ లేనంత హైటెన్షన్ మధ్య ఈసారి `మా` ఎన్నికలు సాగాయి. అనూహ్య రీతిలో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ విజయంలో జీవిత, రాజశేఖర్ దంపతులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్లే నరేష్‌ని గద్దె దింపాలని చూస్తున్నారు. `మా` అధ్యక్షుడిగా నరేష్‌పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నరేష్‌ని `మా` అధ్యక్ష పదవి నుంచి అర్థాంతరంగా తొలగించేందుకు ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ వర్గానికి జీవిత, రాజశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచీ ఫిల్మ్ ఛాంబర్‌లో `మా` సభ్యుల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. నరేష్ అధ్యక్ష పదవికి పనికి రాడంటూ ఓ వర్గం గొంతెత్తింది. నరేష్ కి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో.. `మా` ఫైటింగ్ మొదలైంది. `మా` పీఠంలో కుర్చున్నప్పటి నుంచి ఈ రోజు వరకూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, చాలా సొమ్ము పత్తా లేకుండా పోయిందని రాజశేఖర్ వర్గం ఆరోపణలు చేస్తున్నట్టు సమాచారం. మా సభ్యుల్ని ఒక బృందంగా నడిపించడంలో నరేష్ విఫలమయ్యాడని, అందుకే ఆయన తప్పుకోవాలన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో ఈ విషయమై మా సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో వ్యక్తిగత నిందలకు కూడా దిగిపోతున్నారని, పరిస్థితి పట్టు జారే ప్రమాదం కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. చివరికి ఏం తేలుస్తారో చూడాలి.