కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం రాత్రే ఆయన ఢిల్లీకి బయలుదేరారు. గురువారం ఉదయం పది గంటల సమయంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. నిజానికి, ఆదినారాయణ పార్టీ మార్పుపై అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాతి నుంచి కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. ఆయన కూడా వలస నాయకుడు కదా. అయితే, వాటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. చివరికి, ఇవాళ్ల నిర్ణయం తీసుకున్నారు. ఆయన పార్టీ మారడం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశమే అవుతుంది.
ఆయన్ని పార్టీ నుంచి బయటకి వెళ్లకుండా ఉంచేందుకు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు రోజుల కిందట ఆయన్ని పిలిపించుకుని చాలాసేపు చర్చించారు. పార్టీలో ఉండాలని ఎంత చెప్పినా కూడా.. ఆయన భాజపాలో చేరేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇంతకీ… భాజపాలోకి తప్పనిసరిగా వెళ్లి తీరాల్సిన అవసరం ఆయనకి ఉందా అంటే, అవుననే అంటున్నారు సన్నిహితులు! ఆర్థికంగా కొన్ని సమస్యల్లో ఉన్నారనీ, వాటి నుంచి బయటపడాలంటే కేంద్రంలో అధికారా పార్టీలో చేరక తప్పదు అనే అభిప్రాయం చంద్రబాబు ముందు ఆయన వ్యక్తి చేసినట్టు సమాచారం. కొన్నాళ్లు వెయిట్ చేసే పరిస్థితి లేదని చెప్పడంతో, చంద్రబాబు కూడా ఇక చేసేదేం లేకుండా పోయిందని అంటున్నారు.
నిజానికి, ఆదినారాయణ రెడ్డి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్లిపోవడం అనేది కొత్తేం కాదు! వైయస్సార్ మరణం తరువాత కొన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్నారు, ఆ తరువాత వైకాపాలో చేరిపోయారు. అనంతరం, వైకాపా టిక్కెట్ మీదే గెలిచినా.. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు, ఏపీలో పార్టీ విస్తరణపై భాజపా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా వచ్చేవారంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమాన్ని భాజపా పెట్టుకుంది. ఈలోగానే పార్టీలో చేరిపోతే… ప్రొద్దుటూరులో జరిగే చేరికల కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథి పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి, ఏపీ టీడీపీ నుంచి ఒక కీలక నేత భాజపా బాటపట్టారు. దీన్ని ప్రారంభం మాత్రమే అని భాజపా ఇక చెప్పుకోవడమే తరువాయి.