” అవినీతి జరిగిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను సమీక్షిస్తూంటే.. వెనుక నుంచి హాహాకారాలు వినిపిస్తున్నాయని…” ఆగస్టు పదిహేనో తేదీన జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో… వెటకారం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు… ఆ హాహాకారాలకే భయపడినట్లుగా కనిపిస్తోంది. తాము తెలుగుదేశం పార్టీ హయంలో జరిగిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల జోలికి వెళ్లబోమని.. చెబుతూ.. కేంద్రానికి ఓ లేఖ పంపారు. అవినీతికి ఆధారాలు ఉంటే మాత్రమే… పీపీఏలపై ముందుకు వెళతామని ఆ లేఖలో చెప్పుకొచ్చారు. తాము విద్యుత్ సంస్థలకు .. ఫలానా రేటుకు ఇవ్వాలని చేస్తున్న ఒత్తిడి, నిర్ణయించిన ధర.. ఇక నుంచి చేసుకోబోయే ఒప్పందాలకు మాత్రమే… పరిశీలిస్తామని.. కేంద్రానికి రాసిన లేఖలో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఇకపై ఒప్పందం చేసుకునే వాటిలో..కొత్త ధరలు నిర్ణయిస్తామని లేఖలో ప్రభుత్వం పేర్కొంది.
పీపీఏలను రద్దు చేయాలనేదే మొదటి విధానం..!
నిజానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై.. జగన్మోహన్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా.. మాట్లాడుతూనే ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన సమయంలో చేసిన ప్రసంగంలోనూ వీటి గురించి ప్రస్తావించారు. ప్రమాణస్వీకారానికి ముందు ఢిల్లీలో మోడీని కలిసి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు. పీపీఏను రద్దు చేసి తీరుతామని.. ప్రకటించారు. ఆ ప్రకారమే… చర్యలు తీసుకున్నారు. ముందుగా ప్రత్యేక కమిటీని నియమించారు. విద్యుత్ కంపెనీల ప్రతినిధుల్ని పిలిపించారు. ధరలు తగ్గించాలని హెచ్చరిక ధోరణిలో చెప్పి చూశారు. వారు వినకపోవడంతో కరెంట్ కొనుగోళ్లు ఆపేశారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలకు.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న లేఖలు పంపారు.
పదే పదే తీవ్ర విమర్శలు చేసిన కేంద్రం..!
ఏపీ సీఎం తీరు… దేశంలోకి వస్తున్న పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీయడంతో.. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పలుమార్లు లేఖల ద్వారా హెచ్చరికలు పంపింది. అయితే.. తమకు మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని .. వాళ్లకు చెప్పే చేస్తున్నామంటూ… విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంతో… ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రధాని కూడా.. ఈ విషయంలో.. సీరియస్ అయ్యారని ప్రచారం జరగింది. ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి తీవ్రమైన హెచ్చరికలే ఏపీ సర్కార్ కు అందినట్లుగా చెబుతున్నారు. మూడు రోజుల కిందట… హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జగన్ వ్యవహారంపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. పీపీఏల్లో అవినీతి అంటున్న జగన్ .. ఆధారాలు చూపించడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం… పీపీఏలకు… ఏపీ సర్కార్ రూ. రెండు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.
చివరికి అవినీతి జరగలేదని అంగీకరించక తప్పలేదు..!?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… అవినీతిని వెలికి తీసే విషయంలో.. తన మొదటి ప్రయత్నంలోనే ఫెయిలయ్యారని… సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికి మూడు నెలలు దాటిపోయినా.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంటూ.. ఒక్క దానిలోనూ ఆధారాలు సేకరించలేకపోయారు. తాను స్వయంగా.. అవినీతి జరిగిందని నిర్ధారించి… డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించిన పీపీఏల విషయంలోనూ ఇప్పుడు… కేంద్రం వార్నింగ్ కు లెంపలు వేసుకోక తప్పలేదు. ఆగస్టు పదిహేను చెప్పినట్లుగా.. హాహాకారాలు… పీపీఏల విషయంలో ఇప్పుడు తానే చేయ్యాల్సి వస్తోంది.