ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ పయనంలో… కియా తర్వాత మరో ముందడుగు అనుకున్న అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆగిపోయింది. మరో నెల రోజుల్లో… కృష్ణా జిల్లాలోని మల్లవరం నుంచి ఎలక్ట్రిక్ బస్సు బయటకు వస్తుందని.. అనుకుంటున్న సమయంలో.. ఆ సంస్థ ఉత్పత్తిని నిలిపివేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా.. అమ్మకాలు దారుణంగా పడిపోవడం.. అసలు డిమాండ్ లేకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. సరకు రవాణా వాహన తయారీల్లో అశోక్ లేలాండ్ ది అగ్రస్థానం. హిందూజా గ్రూపునకు చెందిన ఈ దిగ్గజ సంస్థకు బాపులపాడు మండలం మల్లవల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేసింది. తమ ఎలక్ట్రిక్ బస్సుల యూనిట్‌ను ఏపీలో పెట్టేలా.. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు సంస్థను ఒప్పందించారు.
గత ఏడాదే… అంటే.. 2018 మార్చి చివరిలో… ప్లాంట్ నిర్మాణం ప్రారంభమయింది. ఏడాదిన్నరలోనే ఉత్పత్తి చేసేలా శరవేగంగా నిర్మాణం పూర్తి చేశారు. ఇక బస్సులు రెడీ అనుకుంటున్న దశలో.. ప్లాంట్ లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉద్యోగుల్ని క్రమంగా తగ్గించి.. ఇప్పుడు చాలా వరకు పరిమితం చేశారు. ఇప్పుడు.. ఆ ప్లాంట్ లో దాదాపుగా కార్యకలాపాలేమీ సాగడం లేదు. ప్రసిద్ధ.. ఆటోమోబైల్ కంపెనీలన్నీ…. ఉత్పత్తిని కుదిస్తున్నాయి. ఈ క్రమంలో.. భారీ వాహనాల అమ్మకాలు కూడా.. దారుణంగా పడిపోయాయి. అశోక్ లేల్యాండ్ అమ్మకాలు కూడా.. 70 శాతం పడిపోయాయని.. రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా.. ఉత్పత్తిని ప్రారంభించడం అసాధ్యమని.. అశోక్ లేల్యాండ్ నిర్ణయానికి వచ్చింది.
అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు మరింత ఇబ్బంది పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి ఇప్పటికి ప్రారంభించడం సాధ్యం కాదు కనుక… కరెంట్ సరఫరాను… తగ్గించాలని… ఏపీ సర్కార్ కు.. అశోక్ లే ల్యాండ్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అయితే… విద్యుత్ వర్గాలు మాత్రం.. తాము ఒప్పందం ప్రకారం.. విద్యుత్ సరఫరా చేస్తామని.. తగ్గించలేమని… చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సమాధానంపై పరిశ్రమల వర్గాలు కూడా.. నివ్వెర పోతున్నాయి. మాంద్యం సమయంలో పరిశ్రమల్ని ఎలా కాపాడుకోవాలన్నది ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కానీ.. ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏమిటన్న చర్చ నడుస్తోంది.