చింతమనేని ప్రభాకర్‌ను ఇక జైలులోనే ఉంచేలా.. పోలీసులు వరుస కేసులు సిద్ధం చేశారు. ఆయనపై.. 20కిపైగా కేసులు ఉన్నాయని… బాధితులందర్నీ.. సమీకరిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచిన సమయంలో… అసలు కేసు గురించి చెప్పలేదు. కేసు పెట్టినట్లుగా చెబుతున్న ఇద్దరు వ్యక్తులు అడ్డం తిరగడంతో… ఆ కేసు కాకుండా.. పాత కేసును చూపి అరెస్ట్ చూపించి.. రిమాండ్‌కు తరలించారు. చింతమనేని విషయంపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి ఉండటంతో.. పోలీసులు పాత కేసులన్నింటినీ బయటకు తీసి… ఆయనను మళ్లీ బయటకు రాకుండా చేయాలనుకుంటున్నట్లుగా తాజా పరిస్థితులు ఉన్నాయి.
పోలీసులకు చింతమనేని చుక్కలు చూపించారు. ఆయనను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని .. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా… పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు… నానా హైరానా పడ్డారు. పన్నెండు బృందాలను ఏర్పాటు చేసి.. చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ చింతమనేని ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. చింతమనేని మీడియాకు ఫోన్ చేసి లొంగిపోతానని చెప్పడంతో.. పోలీసులు మరింత ఇబ్బందిపడ్డారు. చింతమనేని లొంగిపోక ముందే అరెస్ట్ చేయాలని ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో చాలా గందరగోళం జరిగింది. అయితే.. చింతమనేని ఇంట్లో దొరకలేదు. బయట నుంచి వచ్చారు. అప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
చింతమనేని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు పలు చోట్లకు తిప్పారు. ఎటు తీసుకెళ్తున్నారో తెలియకుండా.. తీసుకెళ్లి చివరకు ఏలూరు కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు. కోర్టు 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. చింతమనేనిని పన్నెండు రోజుల పాటు.. పన్నెండు బృందాలతో వెదికినా పట్టుకోలేకపోయిన పోలీసులు.. లొంగిపోతానని ప్రకటించిన రోజు.. ఏలాగోలా ఆయనింటి వద్దే అరెస్ట్ చేసి పంతం నెగ్గించుకున్నారు.