గ్రేటర్ ఎన్నికలలో తెరాస తిరుగులేని విజయం సాధించింది. ఆ విజయం కోసం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు ఏడాది పాటు చాలా కృషి చేసినప్పటికీ, ఆయన కోరుకొన్నట్లుగానే ఆ విజయం కొడుకు కె.టి.ఆర్.కే మీడియా అంకితం చేస్తోంది. ఈ విజయానికి “నాన్నకు ప్రేమతో…” అని మీడియా టైటిలే అందుకు చక్కటి ఉదాహరణ.
కొడుకు రాజకీయ భవిష్యత్ ని సుస్థిరం చేయడం కోసం కేసీఆర్ చేసిన ఈ కృషిని చూస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకుని ప్రధానిని చేయడం కోసం పరితపించడం గుర్తుకువస్తుంది. ఆమె కూడా తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధికి ప్రధాని పదవిని బంగారు పళ్ళెంలో పెట్టి అందించాలని పదేళ్ళపాటు పరితపించారు. దానిని చేపట్టేందుకు రాహుల్ గాంధికి కె.టి.ఆర్.లాగ తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవలసిన అవసరం కూడా లేదు. ఆయన ‘ఊ’ అంటే మన్మోహన్ సింగ్ ఆ కుర్చీని ఖాళీ చేసి ఆయనకు అప్పగించేవారు. కానీ వడ్డించిన విస్తరిలా సిద్దంగా ఉన్న ప్రధాని పదవిని చేపట్టే అర్హత తనకు లేదనే భయం, సంకోచంతో దానిని చేపట్టడానికి రాహుల్ గాంధి భయపడి ఒక సువర్ణావకాశాన్ని కాలదన్నుకొని మళ్ళీ ఎన్నడూ సరిచేసుకోలేని పెద్ద తప్పు చేసారు.
ఆ తరువాత అందుకు ఆయన సిద్దమయినా ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన శక్తి సామర్ద్యాలను నిరూపించుకొనే అవకాశం ఆయనకు వచ్చింది. ప్రధాని పదవికి తన కొడుకు అన్ని విధాలా అర్హుడని భావించే సోనియా గాంధీ, ఎన్నికలలో పార్టీకి సారధ్యం వహించడానికి మాత్రం సమర్ధుడు కాడని తెలుసు గనుక, ఆ బాధ్యతని మళ్ళీ తన భుజాలపైనే వేసుకొన్నారు. ఎన్నికలలో ఓడిపోతే ఆ అప్రదిష్ట తన ముద్దుల కొడుకుకి అంటుకోకూడదనే ఆమె భయం అతనికి ‘తల్లి చాటు బిడ్డడు’ అనే అపప్రధని తెచ్చి పెట్టింది.
ప్రధాని పదవి చేపట్టడం తన ‘జన్మ హక్కు’ అని భావించే రాహుల్ గాంధి కూడా తాను ఎన్నికలలో పార్టీకి సారద్యం వహించలేననే దృడంగా నమ్మబట్టే తన తల్లి నేతృత్వంలో పనిచేయడానికి మొగ్గు చూపాడు. నిజానికి అప్పటికే కాంగ్రెస్ పార్టీ పరాజయం దాదాపు ఖరారు అయిపోయింది. అందుకే అతనికి ఆ కళంకం అంటుకోకుండా ఆమె జాగ్రత్తపడ్డారు. ఎలాగూ ఓటమి ఖాయమని, దానికి తామే బాధ్యత వహించవలసి వస్తుందని తెలిసినపుడు కనీసం అప్పుడయినా రాహుల్ గాంధి దైర్యం చేసి పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకొని దైర్యంగా పోరాడి ఓడిపోయినా గౌరవంగా ఉండేది. కానీ విజయాలకి తప్ప అపజయాలకి బాధ్యత వహించని గుణం చేత ఆయన అప్పుడూ మరొక మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పటికీ ఆ తల్లికొడుకులలో అదే ధోరణి కనబడుతోంది.
ఇప్పుడు మంత్రి కె.టి.ఆర్.విషయానికి వస్తే మాత్రం తనకు తన తండ్రి అందించిన ఈ అపూర్వ అవకాశాన్ని ఏ మాత్రం భయపడకుండా చక్కగా అందిపుచ్చుకొని ఘన విజయం సాధించి పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల దృష్టిలో కూడా తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించారు.
రాహుల్ గాంధికి, కె.టి.ఆర్.కి ఇద్దరికీ కూడా అవకాశాలు బంగారు పళ్ళెంలో పెట్టే అందించబడ్డాయి. కానీ వారిలో రాహుల్ గాంధి భయంతో దానిని కాలదన్నుకొని పశ్చాతాపపడుతుంటే, కె.టి.ఆర్. అందివచ్చిన ఆ సువర్ణావకాశాన్ని చక్కగా వినియోగించుకొని తన రాజకీయ జీవితానికి బంగారు బాటలు వేసుకొన్నారు. రాహుల్ గాంధి తన జీవితంలో ఎప్పటికయినా ప్రధానమంత్రి కాగలరో లేదో ఎవరూ చెప్పలేరు కానీ కె.టి.ఆర్. మాత్రం ఏదో ఒక రోజు తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చును.