తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చే బుధవారం… పల్నాడులోని ఆత్మకూరు గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ సారి మాత్రం పోలీసులు అడ్డుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపడం.. దానికి జాతీయ స్థాయి ప్రచారం రావడంతో… ప్రభుత్వం కూడా… అలా చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే డీజీపీ కూడా.. చంద్రబాబు పర్యటనకు.. పరిస్థితిని బట్టి.. అనుమతి ఇస్తామని.. మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నిజానికి అనుమతి ఇవ్వడానికి.. ఇవ్వకపోవడానికి… తాము ధర్నాలు, ర్యాలీలు చేయడం లేదని… టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తున్నామని ఆ పార్టీ నేతలు వాదిస్తూంటారు. చంద్రబాబు ఎప్పుడు ఆత్మకూరు వెళ్తే అప్పుడు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం తప్ప.. ఆపే ప్రయత్నం ఇక నుంచి చేయకపోవచ్చు.
పోలీసులు స్వగ్రామాల్లో విడిచి పెట్టిన కార్యకర్తలను .. టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు పరామర్శిస్తున్నారు. వారికి భద్రతా పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అని పరిశీలిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… ఆత్మకూర్ గ్రామస్తులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ అంశాన్ని… ఇంతటితో వదలేయకూడదని… జాతీయ స్థాయిలో లభించిన ప్రచారంతో… మరింతగా.. ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చినందుకు దళితుల్ని ఊళ్లలో ఉండనీయడం లేదన్న అంశాన్ని హైలెట్ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర హోంమంత్రికీ… ఈ అంశంపై ఫిర్యాదు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలంటున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో.. ఓ టీడీపీ మైనార్టీ కార్యకర్తపై.. వైసీపీ నేతలు కత్తులతో దాడి చేసిన వ్యవహారం కలకలం రేపింది. దీనిపై నేరుగా… చంద్రబాబు, లోకేష్ కూడా స్పందించారు. ఇదేమి రాక్షస పాలన అని ప్రశ్నించారు. ఇక రాయలసీమలో… రైతుల చినీ చెట్లు, ఇతర పంటలను ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ సారి రాయలసీమ యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై టీడీపీలో సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.