నిర్బంధాల కాలం..!
అధికారానికి ఎదురెళ్తే గ్యారంటీ లేని కాలం..!
పాలకు అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముప్పు ముంచుకొచ్చే సమయం..!
ఎంత రెబల్ క్యాండేట్లయినా.. మాట్లాడటానికి వణికిపోతున్న సందర్భం..!
ఇప్పుడు అటు దేశంలో.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో… భావితరాలకు.. తీవ్రంగా అన్యాయం జరగబోతోందని… తెలిసిన మరుక్షణం.. ఆ భయం నుంచి బయటపడేందుకు ముందుగా సెలబ్రిటీలే బయటకు వస్తున్నారు. గళమెత్తుతున్నారు. అధికారంలో ఉన్న వారేమనుకుంటారోనన్న… భయానికి పోకుండా.. భవిష్యత్ తరాల కోసం.. తమను తాము వంచించుకోవడం మానేశారు. తమ తమ వర్జినల్ క్యారెక్టర్లను హీరోలుగా మార్చుకుంటున్నారు.
సెలబ్రిటీల ముందడుగుతో “సేవ్ నల్లమల” హైలెట్..!
“సేవ్ నల్లమల” … ఇప్పుడిప్పుడే.. ఓ చిన్న స్థాయి ఉద్యమంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఇతర సినీ ప్రముఖులూ మద్దతు తెలిపారు. విజయ్ దేవరకొండ కూడా ముందుకు వచ్చారు. నిజానికి వీరెవరికి నల్లమలకు.. సంబంధం లేదు. మనకెందులే అనుకోలేదు. ప్రజలతో మమేకమైన సినీ రంగంలో… పేరు తెచ్చుకున్న వారు.. ఆ ప్రజల కోసం.. గొంతెత్తకపోతే.. అది ఆత్మవంచనే అవుతుందనుకున్నారు. అందుకే గళమెత్తారు. సేవ్ నల్లమల అని నినదిస్తున్నారు. ఒక్కొక్కరుగా… బయటకు వస్తున్నారు. నల్లమలను కాపాడుకునేందుకు… చేతులు కలుపుతున్నారు.
పులివెందుల ప్రజల అనారోగ్యమే యూరేనియం నష్టాలకు సజీవ సాక్ష్యం..!
ఎక్కడో ఉండే అమెజాన్ అడవి తగలబడిపోతూంటే.. ఇక్కడ సెలబ్రిటీలు స్పందించారు. దాన్ని వ్యతిరేకించేవారెవరూ ఉండరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమలకు అంత కంటే.. పెద్ద ప్రమాదం… యూరేనియం తవ్వకాలతో వచ్చింది. దాన్ని కాపాడుకోవడానికి.. సెలబ్రిటీలు ముందుకు రాకపోతే.. ప్రజలు నిజాయితీని శంకిస్తారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోలేదు. యూరేనియం తవ్వకాల వల్ల ఎంత దారుణమైన పర్యావరణ నష్టం జరుగుతుందో… చాలా మందికి అవగాహన లేదు. కానీ… ఓ వినాశనం తప్పదన్న విషయంపై మాత్రం .. చిన్నపిల్లలకు కూడా స్పష్టత ఉంటుంది. ఇప్పటికే యూరేనియం కాలుష్యం ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో.. ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల సమీపంలో ఉన్న ప్లాంట్ ద్వారా ప్రజలు అనుభవిస్తున్నారు. ఆ ప్లాంట్ చాలా చిన్నది.
సెలబ్రిటీలను స్ఫూర్తిగా తీసుకోకపోతే భావితరాలకు కాలుష్యమే ఆస్తి..!
ఇప్పుడు… కేంద్రం ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవిని టార్గెట్ చేసి మరీ.. దాన్ని యూరేనియం తవ్వక కేంద్రంగా మారుస్తోంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ సర్కార్ ఎన్వోసీ ఇచ్చింది. తవ్వకాల కోసం.. నల్లమలలో వివిధ సంస్థల అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. అడవిలో విస్తృతంగా తిరుగుతున్నారు. తవ్వకాలు ప్రారంభించిన తర్వాత చేసేదేమీ ఉండదు. అడ్డుకుంటే.. ఇప్పుడే.. లేకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వారమవుతామన్నభావనలో ఉన్నారు. అందుకే.. సెలబ్రిటీలు అడుగు ముందుకు వేశారు. ఇక వారితో మాట కలపాల్సింది.. ఉద్యమానికి పిడికి బిగించాల్సింది… రాజకీయ పార్టీలు. సాధారణ ప్రజలే. లేకపోతే.. భావితరాలకు… కాలుష్యాన్నే వారసత్వ ఆస్తిగా ఇచ్చినవాళ్లమవుతాం.