ఆంధ్రప్రదేశ్‌లో కేబుల్ ఆపరేటర్లకు పులివెందుల పంచాయతీకి పిలిచి వార్నింగ్ ఇచ్చారా..? తాము చెప్పినట్లుగా చానల్స్ బ్యాన్ చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పి పంపించారా..? అవననే వాపోతున్నారు కేబుల్ ఆపరేటర్లు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని… కేబుల్ ఆపరేటర్లతో సమావేశమైన దృశ్యాలను.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసింది. ఆ సమావేశంలో ఏం జరిగిందో.. కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వివరించింది. జగన్ ఆదేశాల మేరుక.. ఏబీఎన్ చానల్ ఏపీలో రాకూడదని… మంత్రులు ఖారాఖండిగా.. ఎమ్మెస్వోలకు తేల్చేశారని అంటున్నారు. అయితే.. ట్రాయ్ తీసుకు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు… కోరుకున్న చానల్ ను విధిగా అందించాల్సి ఉంటుందని.. ముఖ్యంగా ఫ్రీ చానల్ అయితే.. నిరాకరించడానికి వీల్లేదని.. అాల చేస్తే చట్ట విరుద్ధమవుతుందని.. ఎమ్మెస్వోలు.. మంత్రులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెస్వోల సమాధానంపై… మంత్రులు సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. చట్టాలు, నిబంధనల గురించి వినిపించుకోకుండా… తాము చెప్పిన టీవీ చానళ్లు… కేబుల్ నెట్ వర్కుల్లో రాకూడదని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా… వివరించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. కేబుల్ ఆపరేటర్లంతా భయపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు.. అటు ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం పెట్టి మంత్రులతో హెచ్చరికలు ఇప్పించడం చట్ట ఉల్లంఘనే అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇతర పార్టీలు.. చానళ్లను నిషేధించడంపై… మండి పడుతున్నాయి. మీడియా హక్కులను హరించడం పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించడమేనన్నారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలను నిలువరించాలనుకోవడం అవివేకమని మమండిపడ్డారు. ట్రాయ్‌కి ఫిర్యాదు చేస్తే .. కేబుల్ ఆపరేటర్ల లైసెన్సులు రద్దవుతాయని.. వారు కూడా ఆలోచించుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరించారు.
చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం.. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడమేనని.. కమ్యూనిస్టు పార్టీ నేతలు మండిపడ్డారు. మంత్రులు ఎం.ఎస్.వో.లను పిలిపించి వార్నింగ్ లు ఇవ్వడం, ఛానెళ్ల ప్రసారాలను ఆపమని బెదిరించటం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో చానళ్లను నిషేధించినా… మీడియా స్వేచ్చ అంటూ.. ఊగిపోయే నేతలు… ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు.