అమరావతి రాజధానికి అనుకూలమో కాదో.. నివేదిక ఇవ్వాలన్నట్లుగా.. ఓ కమిటీని ఏపీ సర్కార్ కొత్తగా నియమించడం అనేక చర్చలకు కారణం అవుతోంది. అనుకూలంగా కాదని నిపుణులు చెప్పారని చెప్పి… రాజధానిని మార్చుకోవడానికే.., ఈ పంథాను ఎంచుకున్నారా.. అనే భావన కూడా… రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి.. తమకు ఇష్టం లేని వాటిని.. ఆపేయాలనుకుంటున్న వాటిపై.. ఇలా కమిటీలు వేస్తూ.. ప్రభుత్వం తమకు కావాల్సిన నివేదికలు.. అంతకు ముందు నుంచి తాము చెబుతున్న వాదనలతో నివేదికలు ఇప్పించుకుంటోంది.
పోలవరం పనైపోయింది.. ఇప్పుడు అమరావతిపై నిపుణుల కమిటీ..!
జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే కాంట్రాక్టుల సంగతి చూసింది. ఏపీలో ఎవరూ … ఎలాంటి పని చేయవద్దని కాంట్రాక్టర్లను ఆదేశించింది. ముందుగా పోలవరం కాంట్రాక్టర్ ను సాగనంపింది. ఇలా చేయాలంటే.. ఓ ప్రాతిపదిక కావాలి కాబట్టి.. సీఎం బంధువుగా అధికారవర్గాల్లో ప్రచారం ఉన్న రేమండ్ పీటర్ అను విశ్రాంత చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో కమిటీ నియమించింది. ఆయన ఎన్నికల ప్రచారంలో జగన్ ఏం చెప్పారో.. దాన్నే నివేదిక రూపంలో ఇచ్చారు. వెంటనే… ఆ నివేదికను చూపి కాంట్రాక్టర్లకు జగన్ .. టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. అది న్యాయవివాదాల్లోకి చిక్కుకోవడం తర్వాతి విషయం. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే జరగబోతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు నిపుణులతో కమిటీ వేశారు. ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ , పట్టణ ప్రణాళిక ప్లానర్లతో ఈ కమిటీ ఏర్పడింది.
మంత్రి బొత్స చేసిన వాదననే ఈ కమిటీ చెప్పనుందా..?
ఈ కమిటీకి ఆరు వారాల గడువు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వేసిన ప్రతి కమిటీకి ఆరు వారాల గడువిచ్చారు. సీపీఎస్ రద్దు కోసం వేసిన కమిటీకి కూడా ఆరువారాల గడువిచ్చారు., అలాగే.. ఈ కమిటీకి కూడా ఆరు వారాల గడువిచ్చారు. వరద వస్తే మునుగుతుందని.. ఖర్చు ఎక్కువ అవుతుందని… మంత్రి బొత్స చేసిన ప్రచారానికి అనుగుణంగా… ఆ అంశాలపై ఓ నివేదిక తెప్పించుకోవడానికే.. ఈ కమిటీని నియమించిందనే అనుమానాలు సహజంగానేప్రారంభమయ్యాయి. ఈ కమిటీ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధిని సమీక్షించడమే కాకుండా సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను కూడా సూచిస్తుందని నియామక ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. సమగ్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా రాజధాని అభివృద్ధిని కూడా సూచిస్తుందని ప్రభుత్వం చెబుతోంది
సింగపూర్ మాస్టర్ ప్లాన్ సంగతి మర్చిపోయిన ఏపీ సర్కార్..!
అమరావతికి అభివృద్ధికి ఇప్పటికే గత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ఈ ప్లాన్ ఆధారంగానే ప్రభుత్వం నిర్మాణాలను కూడా చేపట్టింది. సచివాలయ టవర్స్, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన టవర్స్ నిర్మాణం కూడా చేపట్టారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్.. ఓ అద్భుతమైన ప్రణాళిక అని… నిపుణుల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రతి చిన్న విషయాన్ని సాంకేతికంగా విశ్లేషించి… సింగపూర్ మాస్టర్ ప్లాన్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా .. ఆర్కిటెక్చర్ నిపుణుల సాయం తీసుకున్నారు. నిర్మాణాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ.. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ఒక కమిటీని నియమించడం … ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు. కావాల్సిన నివేదిక ఇప్పించుకుని తమ ప్లాన్ ను అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.