ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి బడ్జెట్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయిస్తా. డిపాజిటర్లందరికీ న్యాయం చేస్తానని జగన్ పాదయాత్రలో ప్రతీ చోటా చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చారు. బడ్జెట్లో రూ. 1150 కోట్లు పెట్టారు. కానీ ఇప్పటికీ.. ఒక్కటంటే.. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అగ్రిగోల్డ్ బాధితులు.. తమ డబ్బులు వస్తాయేమోనని ఆశగా ఎదురు చూడటం.. నిరాశతో వెనుదిరగడం… కామన్ అయిపోయింది. ఈ క్రమంలో.. వారి తరపున పోరాడుతున్న కమ్యూనిస్టు నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు.. సీఎంను కలుద్దామని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు అపాయింట్మెంటే దొరకడం లేదట. ఈ విషయాన్నే ఆయనే చెప్పుకుని బాధపడ్డారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు. కమ్యూనిస్టు పార్టీ నేతగా.. ఈయన చాలా మందికి తెలుసు కానీ… ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అయిపోయారు. బాధితుల తరపున ఓ సంఘం ఏర్పాటు చేసి… అప్పటి ఏపీ సర్కార్ పై పోరాడారు. ఆత్మహత్యలు చేయించుకున్నవారికి పరిహారం ఇప్పించారు. ప్రైవేటు సంస్థ సేకరించిన డిపాజిట్లకు.. ప్రభుత్వం తరపున ప్రజాధనం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. బాధితులు లక్షల్లో ఉండటంతో.. అప్పటి చంద్రబాబు సర్కార్ కూడా.. ఇవ్వడానికి అంగీకరించింది. రూ. 200 కోట్లు అప్పటికి రిలీజ్ చేసింది వాటిని రూ. 10వేల లోపు డిపాజిటర్లకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ లోపే సర్కార్ మారింది. జగన్ వచ్చారు. పరిస్థితి తిరగబడింది. కనీసం.. చంద్రబాబు రిలీజ్ చేసిన.. ఆ రూ. రెండు వందల కోట్లయినా బాధితులకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
అగ్రిగోల్డ్ బాదితులకు పరిహారం అందించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉండాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. బాదితులకు పరిహారం అందించే విధంగా నాన్చుడి ధోరణి, కాలయాపన చేయకుండా వెంటనే బాదితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చే వాగ్ధానాలు కేవలం ప్రకటనలు, కాగితాలకే పరిమితం కార్యాచరణలో అమలయ్యేలా ముఖ్యమంత్రి జగన్ చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కొసమెరుపేమింటే… ప్రభుత్వంలో ఈ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా… సీఎం జగన్ ఒకటే మాట చెబుతూంటారు. ఇప్పుడే.. ఆర్థిక శాఖ కార్యదర్శికి.. ఆదేశాలిచ్చాను.. అగ్రిగోల్డ్ కు.. కేటాయించిన రూ. 1150 కోట్లు విడుదల చేయమని చెప్పాను.. అని .. ఈ ముక్కను .. ప్రభుత్వ పీర్వోలు వెల్లడిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి విడుదల కాలేదు.