నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘రాజసింహం’ తమిళంలో విడుదల అవుతోంది? నాగార్జునేంటి? రాజసింగం అనే సినిమా చేయడం ఏమిటి? ఇదంతా ఎప్పుడు జరిగింది? అనుకుంటున్నారా?
ఎన్నిమిదేళ్ల క్రితం నాగార్జున ‘రాజన్న’ అనే సినిమా చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగులోనే అస్సలేమాత్రం ఆడని సినిమాని, ఎనిమిదేళ్ల తరవాత తమిళంలో విడుదల చేయడం ఏమిటి? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మార్కెట్ స్ట్రాటజీనే.
ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకుడు. రాజమౌళి కొన్నియాక్షన్ ఘట్టాల్ని దగ్గరుండి తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ ముగ్గురూ `బాహుబలి`కి పనిచేసినవాళ్లే. అందుకే ఫ్రమ్‌ది క్రియేటర్స్ ఆఫ్ బాహుబలి అంటూ ఓ ట్యాగ్ తగిలించి, దానికి ఈ ముగ్గురి మొహాలూ జోడించి, ఎనిమిదేళ్ల నాటి ఫ్లాప్ సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నారన్నమాట.బాహుబలి క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలన్న ఆశ తప్ప.. ఇంకేముంది ఇక్కడ? రాజమౌళి బొమ్మ పడినంత మాత్రన ఈ సినిమాకి తమిళనాట క్రేజ్ పెరిగిపోతుందని అనుకోవడం అమాయకత్వం. ఈ సినిమా ఇప్పటికే యూ ట్యూబ్‌లో ఉంది. హిందీ వెర్షన్ కూడా చాలాసార్లు టెలీకాస్ట్ అయ్యింది. తమిళ తంబీలేం అమాయకులు కాదు. ఇది పాత సినిమా అని పసిగట్టకపోవడానికి. మరి ఇంత తాపత్రయం ఎందుకో..?