ఉద్దానం లో దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో బలంగా గళం వినిపించడం, ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు వీలైనంత సహాయం అందేలా చేయడం, జనసైనికులు స్వయంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం తెలిసిన సంగతే. అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడ్డాక, వైయస్సార్ సిపి నాయకులు బొత్స సత్యనారాయణ , విజయసాయిరెడ్డి లాంటివారు పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య విషయంలో సైతం తప్పుపడుతూ విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు.
ఉద్దానం విషయంలో పవన్ పై బొత్స విజయసాయిరెడ్డి ల తీవ్ర విమర్శలు:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వందరోజుల జగన్ పాలన పై నివేదిక ఇచ్చారు. జగన్ పాలనలో పారదర్శకత , దార్శనికత లోపించిందని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, ఉద్దానం విషయంలో తన ని విమర్శిస్తూ బొత్స చేసిన వ్యాఖ్యలను రిపోర్టర్స్ గుర్తు చేసినప్పుడు, బొత్సపై కౌంటర్స్ వేశారు. ఇటీవల అక్కడ 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ఉద్దానం సమస్య పరిష్కరించడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చిత్తశుద్ధి తో ముందడుగులు వేస్తోందని, మరి అప్పట్లో ఉద్దానం సమస్య పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని సన్మానిస్తారా లేక చంద్రబాబుకి పార్టనర్ గా మిగిలిపోతారా అన్నది తానే తేల్చుకోవాలని వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే, పవన్ కళ్యాణ్ వి ఉద్దానం విషయంలో గాలి మాటలని, అద్దె విమానాల్లో తిరగడం తప్ప ఉద్దానం విషయంలో ఆయన చేసింది ఏమీ లేదని ట్విట్టర్లో విమర్శించారు. రాజకీయాల్లో జయాపజయాల సంగతి పక్కన పెడితే, ఉద్దానం విషయంలో వైఎస్ఆర్ సీపీ నేతల వ్యాఖ్యలు సామాన్య ప్రజలకు అంతగా మింగుడు పడలేదు. ఉద్దానం విషయంలో పవన్ చిత్తశుద్ధిని కావాలనే వీరు కించపరుస్తూ ఉన్నారని, పదేపదే అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రజలను నమ్మించడానికి వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తటస్థులు సైతం అభిప్రాయపడ్డారు.
బొత్స ఉద్దానం వ్యాఖ్యల పై పవన్ కౌంటర్:
అయితే బొత్స వ్యాఖ్యల పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఉద్దానం సమస్యను వెలుగులోకి తెచ్చింది జనసైనికుల ని, జనసేన ఆరోజు ఈ సమస్యను వెలుగులోకి తీసుకురావడం వల్లే, ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు తాము ప్రభుత్వం లో ఉన్నారు కాబట్టి రిబ్బన్ కట్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడితో ఆగకుండా, బొత్స సొంత నియోజకవర్గం పక్కన ఉన్న ఊళ్లలో బోదకాలు విపరీతంగా ప్రబలి ఉందని, బొత్స దాని మీద దృష్టి సారించాలని హితవు పలికారు.
రాజధానిగా కర్నూలు విషయం లో బొత్స వర్సెస్ పవన్:
అదే విధంగా రాజధాని విషయంలో కూడా బొత్స, పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. అమరావతి ని రాజధానిగా కొనసాగించే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనకడుగు వేయడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టినప్పుడు ఆ వ్యాఖ్యలపై స్పందించారు బొత్స సత్యనారాయణ. గతంలో కర్నూలుని రాజధానిగా చేయాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అని, ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలపాలని విమర్శించారు బొత్స సత్యనారాయణ. అయితే బొత్స వ్యాఖ్యల పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, గతంలో తాను – కర్నూలు రాజధాని ని హైదరాబాద్ కోసం కోల్పోయిందని, కాబట్టి ఇప్పుడు రాజధాని అమరావతి కి దీటుగా కర్నూలు ను అభివృద్ధి చేయాలని తాను వ్యాఖ్యానించానని, అమరావతి నుండి రాజధాని గా తీసేసి కర్నూలు ను రాజధాని చేయమని తానెప్పుడూ అనలేదని, కావాలంటే బొత్స సత్యనారాయణ యూట్యూబ్ లో ఉన్న వీడియోలను చూసుకోవాలని పవన్ కళ్యాణ్ బొత్స కి కౌంటర్ వేశారు.
మొత్తానికి వంద రోజుల జగన్ పాలన పై పవన్ కళ్యాణ్ ఈ రోజు నివేదిక ఇచ్చిన సందర్భంగా బొత్స సత్యనారాయణ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించాయి.