ఆంధ్రాలో అధికార పార్టీగా వందరోజుల వైకాపా పాలన తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో పాదర్శకత లోపించిందనీ, ఉద్దానం లాంటి సమస్యలపై ప్రభుత్వంపై చిత్తశుద్ధి లేదంటూ చాలా అంశాలపై పవన్ విమర్శలు చేశారు. అయితే, వీటిపై వెంటనే స్పందించేసింది అధికార పార్టీ వైకాపా. ఆ పార్టీకి చెందిన కొంతమంది కాపు ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ తీరుపై విమర్శలు గుప్పించారు.
వైకాపా ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడు స్క్రిప్టే చదువుతున్నారని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలు లోపించాయని పవన్ అన్నారనీ, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడుందన్నారు. జగన్ పాలన బాగుందని ప్రజలు మెచ్చుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో లేని సమస్యల్ని సృష్టించడం కోసం పల్నాడు అంశాన్ని చంద్రబాబు తీసుకుంటే, దానికి మీరు కూడా వత్తాసు పలకడం సరికాదన్నారు. పవన్ నివేదికకు తలాతోకా లేదన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్. ఎన్నికల ముందు భీమవరం పోటీ చేస్తానని కాసేపు, గాజువాక అని కాసేపు గందరగోళపడ్డారన్నారు. చివరికి గాజువాకలో పోటీ చేస్తే అక్కడి ప్రజలు ఓడించారనీ, వైకాపా 100 రోజుల పాలన గురించి మాట్లాడే ముందు గాజువాకలో ఓటు వేసిన ప్రజల కోసం కనీసం 100 సెకెన్లైనా పవన్ ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఇసుక పాలసీపై పవన్ కి ఏమీ తెలీదనీ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పూర్తి అవగాహన లేదన్నారు.
వైకాపా వందరోజుల పాలనపై పవన్ నివేదిక ఇచ్చిన వెంటనే… ఈ స్థాయిలో అధికార పార్టీ వెంటవెంటనే తిప్పి కొట్టేయాల్సిన పనేముంది? పవన్ అంశాలవారీగా విమర్శలు చేస్తే… వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. పవన్ వైకాపా పాలనను ప్రశ్నిస్తే… మీరు టీడీపీకి వత్తాసు పలుకుతున్నారు, గాజువాకలో ఓడిపోయారు కదా అంటూ స్పందిస్తున్నారు. పవన్ గాజువాకలో ఈ వందరోజులు ఏం చేసినా చెయ్యకపోయినా ప్రజలు పట్టించుకోరు. టీడీపీ స్క్రిప్టు ప్రకారమే ఆయన నడుస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయం కాదు. అధికారంలో ఉన్నది వైకాపా. పరిపాలన వారి చేతులో ఉంది. కాబట్టి, ఇతర పక్షాలన్నీ ఆ పరిపాలనలో లోటుపాట్లను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ లోపాలుంటే సరిదిద్దుకుంటామని హుందాగా స్పందిస్తే బాగుండేది. అంతేగానీ, తమ పార్టీ పాలనను విమర్శించడమే తప్పు అన్నట్టుగా విరుచుకుపడుతున్నారు వైకాపా ఎమ్మెల్యేలు!