తెలంగాణ అసెంబ్లీ ఇంటికో ఉద్యోగం హామీకి సంబంధించి కాంగ్రెస్ తెరాసల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సభలో మాట్లాడుతూ… నీటి వనరులను సద్వినియోగం కోసమే రాష్ట్రం సాధించుకున్నామనీ, కానీ ప్రస్తుతం ప్రాజెక్టు పేరుతో ఖర్చులు పెరిగిపోతున్నాయనీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు కూడా ఎక్కువైపోయాయని ఆయన అన్నారు. నిరుద్యోగం గురించి మాట్లాడుతూ… తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని భట్టి గుర్తుచేశారు. ఈ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆనాడు చెప్పారన్నారు.
వెంటనే మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని… సత్య దూరమైనవి, వాస్తవ విరుద్ధంగా, నిర్హేతుకంగా, అసంబద్ధంగా ఏది బడితే అది మాట్లాడతామంటే వింటూ కూర్చోవడానికి మేం సిద్ధంగా లేమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మాటే వాస్తవమైతే… మా మేనిఫెస్టోలోగానీ ఇంకెక్కడైనా చెప్పి ఉంటే, దయచేసి రుజువు చెయ్యండన్నారు. లేదంటే, బేషరతుగా మీ మాటల ఉపసంహరించుకుని సభావేదికగా మా నాయకుడికీ పార్టీకీ క్షమాపణలు చెప్పాలన్నారు. శాసన సభలో ఉంటూ ఏదో ఒకటి మాట్లాడేసి సభను మిస్ లీడ్ చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. మేము అనని మాటలు మాకు ఆపాదించి మాట్లాడితే మేం ఊరుకోమని కేటీఆర్ అన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పమనగానే చెప్పడానికి తాను వారి బానిసను కాదంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ఇంటికో ఉద్యోగం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి సంబంధించిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయన్నారు.
అద్భుతమైన తెలంగాణ వస్తది, పసిడి పంటలతో కళకళలాడుతది, ప్రతీ ఇంటికొక ఉద్యోగం వస్తది… గతంలో కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పిన మాటలివి. మరో బహిరంగ సభలో కూడా ఇలానే కుటుంబానికో ఉద్యోగం వస్తుందనే అన్నారు. యూట్యూబ్ లో ఎవరు సెర్చ్ చేసినా కేసీఆర్ పాత స్పీచుల్లో ఈ ఇంటికో ఉద్యోగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, గతంలో ఇదే హామీపై కేసీఆర్ కూడా మాట మార్చారు. ఆయన కూడా ఇలానే సభలో మాట్లాడుతూ… మేము ఎన్నడైనా అన్నమా, అయినా ఇంటికో ఉద్యోగం ఎట్ల సాధ్యం అంటూ లెక్కలు చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అంతే అడ్డగోలుగా… చాలా విశేషణాలను వాడుతూ భట్టి విక్రమార్కపై విరుచుకుపడ్డారు. గతంలో అన్నమా, మేనిఫెస్టోలో ఉందా అంటూ బుకాయింపుగా మాట్లాడారు. ఇంటికో ఉద్యోగ హామీపై ఇప్పుడు మరోసారి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితిని మళ్లీ కొనితెచ్చుకున్నారు.