అక్టోబర్ పదిహేనో తేదీన రైతు భరోసా కింద రూ. 12500 వస్తాయని ఎదురు చూస్తున్న కౌలు రైతులకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి షాక్ ఇచ్చారు. పథకం అమలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కౌలు రైతులందరికీ.. రైతు భరోసా వర్తించదని.. కొత్తగా… ప్రభుత్వం నుంచి సమాచారం బయటకు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు మాత్రమే… రైతు భరోసా కింద సాయం చేస్తారట. అందులోనూ.. మళ్లీ కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు కూడా ఉన్నాయి.
కౌలు రైతులకు కులం అర్హత చూడటమేంటి…?
“నేను ఉన్నాను.. నేను విన్నాను…” పార్టీలు, కులం, మతం, రాజకీయం చూడకుండా.. రైతులందర్నీ ఆదుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులు రైతు భరోసా ఇవ్వడానికి మాత్రం… కులం చూస్తున్నారు. ఓసీ రైతులు ఎవరైనా కౌలుకు తీసుకుంటే.. వారికి రైతు భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని వ్యవసాయ మిషన్ సమావేశంలో స్పష్టం చేశారు. ఓసీ కౌలు రైతులకు భరోసా లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. మిగిలిన వారికి సాయం చేయడంలోనూ.. కొన్ని మెలికలు ఉన్నాయి. ఒక రైతుల.. తన పొలాన్ని ఐదారుగురికి కౌలుకి ఇస్తే.. ఆ ఐదారుగురిలో ఒక్కరికే… కౌలు సాయం చేస్తారట. వారు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలైనా సరే. అంటే… అటు ఓసీ కౌలు రైతులకు.. ఇటు ఇస్తామని చెప్పే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ రైతులకూ గండమే.
భారం తగ్గించుకోవడానికి ఆంక్షలా..?
రైతులు ఏ కులమైనా.. ఏ మతమైనా రైతులే. వారు చేసే సాగే. కష్టానష్టాలు కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకటే. అయినా.. ఇప్పుడు ఏపీ సర్కార్ కొత్తగా ఎందుకు ఆంక్షలు పెడుతోందో… ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఈ ఆంక్షలు పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓసీ రైతుల లెక్కలు సక్రమంగా లేవని.. అందుకే… వారికి ఇవ్వడం లేదన్నట్లుగా.. వ్యవసాయ మిషన్ సమావేశంలో జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లెక్కలు తేలినప్పుడు.. మిగిలిన వారంతా.. ఐటోమేటిక్ గా ఓసీలవుతారు కదా.. అనే చిన్న లాజిక్‌ను జగన్ ఎలా మిస్సయ్యారు. ..? కొంత మందికి పథకం అందకుండా చేసే మోసంలో భాగంగానే కొత్త నిబంధనలు పెడుతున్నారనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి.
నవరత్నాలకు తూట్లు పొడిస్తే రైతుల్లో అసహనమే..!
మేనిఫెస్టోను.. ఖురాన్, బైబిల్, భగవద్గీతగా ముఖ్యమంత్రి చెబుతూంటారు. ఇప్పుడు.. అర్థం పర్థం లేని.. నిబంధనల పేరుతో.. ఆ మేనిఫెస్టోలోని పథకాల లబ్దిదారులను.. తగ్గించే ప్రయత్నం చేయడం… రైతులను సైతం విస్మయ పరుస్తోంది. ఇప్పటికే.. ఒకే సారి రూ. 12500 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి.. అందులో కేంద్ర ప్రభుత్వం .. కిసాన్ యోజన కింద ఇస్తున్న రూ. 6000 ఉన్నాయని చెబుతున్నారు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ. 6500 మాత్రమే. ఇప్పుడు.. వీటిలోనూ… కోత విధించడానికి.. లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పథకం దగ్గర పడే కొద్దీ.. ఇతర రైతులకూ… ఇలాంటి నిబంధనలు పెడతారేమోనన్న సందేహం… ప్రారంభమవుతోంది. రైతుల్లో ఆగ్రహానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.