ఓ కేసు అప్పగిస్తే రెండో కేసు ఫ్రీ
పేటీఎమ్ ద్వారా డబ్బులు జమ చేస్తే 50% డిస్కౌంట్
కేసు ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్
– ఇదీ ఓ చెట్టుకింద ప్లీడరు ఇచ్చే ఆఫర్లు. కర్నూలు కోర్టులో పాగా వేయాలనుకున్న ఈ లాయరుకి కేసులే దొరకవు. దొరికినా వాదించడం చేతకాదు. అబ్జెక్షన్ యువరానర్ అంటూ ఎవరివైపు చూసి చెప్పాలో కూడా తెలియనంత అమాయకుడు. ఇలాంటి లాయర్‌కి వరలక్ష్మి తారసడుతుంది. తనదో విచిత్రమైన కేసు. ఆ కేసుని వాదించే అవకాశం తెనాలి రామకృష్ణకే వస్తుంది. మరి ఆ తరవాత ఏం జరిగిందన్నది తెలియాలంటే… తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి చూడాల్సింది. సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రమిది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రభాస్ శీను, సప్తగిరి, వెన్నెల కిషోర్, జబర్దస్త్ టీమ్… ఈ గ్యాంగ్ అంతా ఉంది కాబట్టి కామెడీకి ఢోకా లేదు. సందీప్‌తో పోలిస్తే ప్రభాస్ శీనుకే ఎక్కువ డైలాగులు ఇచ్చారు టీజర్లో. టీజర్ చివర్లో యాక్షన్ టర్న్ ఇచ్చుకుంది. `చెట్టుకింద ప్లీడర్`, `జానీ ఎల్ఎల్బీ` ఛాయలు ఈ టీజర్లో కనిపిస్తున్నాయి. మరి వాటికి భిన్నంగా నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని ఎలా డీల్ చేశాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.