నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని.. ఇచ్చే ప్రసక్తే లేదని.. మంత్రి కేటీఆర్ శాసనమండలిలో స్పష్టంగా ప్రకటించారు. కేటీఆర్ దీనిపై కాస్త సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. యూరేనియం మైనింగ్ విషయంలో రెండుదశలు ఉంటాయని.. మొదటి దశలో అన్వేషణ ఉంటుందన్నారు. ప్రస్తుతం జియాలజిస్టులు అన్వేషణలో ఉన్నారన్నారు. నల్లగొండ జిల్లాలో యూరేనియం అన్వేషణకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని… అమ్రాబాద్ అడవల్లో మాత్రం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదున్నారు. కేంద్రం పరిధిలోని ఏఎండీ ఆధ్వర్యంలో ప్రస్తుతం.. అన్వేషణ జరుగుతోందన్నారు. యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్ వెలువడదని కేటీఆర్ స్పష్టం చేశారు.
నిక్షేపాలు వెలుగుచూసినా.. తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమన్న షరతులోనే … అన్వేషణకు.. పర్మిషన్లు ఇచ్చినట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. యురేనియం లభ్యత ఉందని తేలినా ప్రభుత్వం అనుమతివ్వబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిర్దిష్ట విధానం, ఆలోచన ఉందని సభకు వెల్లడించారు. అన్వేషణ దశలోనే కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యురేనియంపై లేని భయాందోళనలు సృష్టించవద్దని కోరారు. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
కేటీఆర్ ప్రకటన… యూరేనియం తవ్వకాలపై పోరాటం చేస్తున్న వారికి మరింత ఆందోళన కలిగించేలా ఉంది. అసలు తవ్వకాలకు అనుమతి ఇచ్చే అవకాశమే లేనప్పుడు.. నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలుసుకునే అవసరం ఎందుకొచ్చింది..? అసలు పర్మిషన్ ఎందుకిచ్చారు..? ఇంత కాలం… విపక్షాలు ఆందోళన చేస్తున్నా.. ఎందుకు ఇంత ఆలస్యంగా స్పందించారన్నది ఆసక్తికరంగా మారింది. సేవ్ నల్లమల ఉద్యమం… ప్రజల్లోకి వెళ్లిపోతూండటంతో… ముందు జాగ్రత్తగా ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. యూరేనియం విషయంలో…. మైనింగ్ కు ఇప్పటికే… తెలంగాణ సర్కార్ ఎన్వోసీ జారీ చేసిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.