తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలివి! నీటి ప్రాజెక్టుల మీద ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం, తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులపై ఆయన చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంలో… మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్సార్ గురించి మాట్లాడుతూ, ఆయన తెలంగాణకి మోసం చేశారన్నారు. వైయస్సార్ రైతు పక్షపాతేననీ, కాకపోతే ఆయన ఆంధ్రా రైతు పక్షపాతి అన్నారు. పులిచింతల కట్టుకోవాలని ప్రయత్నించారనీ, పోలవరం కట్టుకోవాలనీ, శ్రీశైలానికి గండి పెట్టి పోతిరెడ్డిపాడుకు నీళ్లను తరలించుకుని పోవాలన్నది వైయస్సార్ అజెండా అన్నారు. అదే దశలో తెలంగాణ పరిస్థితి అని పెద్దగా లొల్లి పెట్టుకున్నామన్నారు.
ఎగువ రాష్ట్రం మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోవడం కోసం చాలా కష్టపడ్డామన్నారు. కృష్ణా నది కూడా ఎండిపోవద్దనీ, పాలమూరు బతకాలనీ, నల్గొండ వికారాబాద్ రంగారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. దీని కోసమనే ఓసారి అమరావతి వెళ్లి, చంద్రబాబు నాయుడుతో ఆయన ఇంట్లో కూర్చుని మాట్లాడానన్నారు. సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్నాయనీ, పొద్దాక ఏం పంచాయితిలు పెడ్తవనీ, ఈ దిక్కుమాలిన పంచాయితీలు బంద్ చెయ్యండీ, సమైక్య రాష్ట్రంలో అన్యాయం చేసి రాష్ట్ర విభజనకు దోహదమయ్యారనీ, ఇప్పుడైనా మీ వైఖరి మార్చుకోండి అంటే ఆయన విన్లేదని కేసీఆర్ చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కేసు పెట్టి సతాయించినా తట్టుకున్నామన్నారు.
ఫైనల్ గా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, సుహృద్భావ వాతావరణంలో చర్చలకు ఆయన ముందుకు వచ్చారన్నారు. గోదావరి, కృష్ణ నీళ్లను వాడుకోవడం విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ వచ్చాక తాము ఏవిధంగా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నామనీ, ఎలా నీళ్లు తెచ్చుకున్నామో మీరూ అలానే తెచ్చుకుని బాగుపడండని చెప్పానన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు రైతులు బాగుపడాలని తాను అభిప్రాయపడ్డాననీ, జగన్ విన్నారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు వైయస్సార్ అన్యాయం చేశారు, తెలంగాణ ఏర్పడ్డాక కూడా కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబు వైఖరి మార్చుకోకుండా కేసులు వేశారు, ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక… తన మాట విని, నీటి విషయంలో అనుభవాన్ని గ్రహించి న్యాయం చేస్తున్నారనేది కేసీఆర్ మాట.