పాపికొండల ప్రాంతాన్ని ఆదివారం ఆహ్లాదంగా ఆస్వాదిద్దామని వెళ్లిన పర్యాటకులు.. ప్రాణాలు పణంగా పెట్టాల్సిన ఘోర ప్రమాదం.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద చోటు చేసుకుంది. రాయల్ వశిష్ట అనే బోటులో… 62 మంది పర్యాటకులు… దేవీపట్నం నుంచి పాపికొండలు టూర్‌కు బయలుదేరారు. ఉదయం పదిన్నర సమయంలోనే… బోటు మునిగింది. దీనిపై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ.. స్పందించేవారే లేరు. లైఫ్ జాకెట్లు ఉన్న పాతిక మంది కొట్టుకుపోతూండగా… గోదావరి తీర గ్రామాల ప్రజల రక్షించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటికీ పన్నెండు మంది మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.
పదిన్నరకు ప్రమాదం జరిగినా మధ్యాహ్నం వరకూ స్పందనేది..?
ఆదివారం కాబట్టి.. అధికారవర్గాలు.. బోటు ప్రమాదం విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాంతో.. ప్రాణ నష్టం అధికంగా జరిగింది. గల్లంతయిన వారి కోసం.. ఆరేడుగంటల తర్వాత వెదుకులాట ప్రారంభించారు. విషయం మీడియాలో వచ్చిన తర్వాత ప్రభుత్వ వర్గాలు హడావుడి ప్రారంభించారు. హెలికాఫ్టర్‌ను పంపిస్తున్నట్లుగా.. మంత్రులు సంఘటనా స్థలానికి వెళ్తున్నట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే.. మధ్యాహ్నం మూడు గంటల వరకూ .. ఏ ఒక్క ఉన్నతాధికారి ప్రమాద స్థలం వద్దకు రాలేదు. గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని… సహాయచర్యలు ఎలా చేపట్టాలన్న అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నట్లుగా … చెప్పుకొచ్చారు. ఆలస్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం గోదావరిలోనే అత్యంత లోతైన ప్రాంతం.
ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహంలో బోటు ఎలా వెళ్లింది..?
గోదావరి ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బోట్లకు అనుమతి ఇవ్వరు. సహజంగానే నిషేధం ఉంటుంది. అయితే బోట్ల యజమానులు పట్టించుకోరు. రాయల్ వశిష్ట బోటుకు పర్యాటక శాఖ అనుమతి ఉంది. అయితే.. వరదల సమయంలో ఆ అనుమతి పని చేయలేదు. అయితే.. అధికారులకు లంచాలిచ్చి… బోటు యజమానులు నడిపేస్తూ ఉంటారు. ఈ పడవను కూడా.. కోడిగుడ్ల వెంకటరమణ అనే వ్యక్తి నడుపుతున్నారు. ఆయన కూడా.. అధికారులకు అమ్యామ్యాలు ముట్ట చెప్పి తన పని తాను చేసుకుపోయారు. పర్యాటకుల్లో అత్యధికులు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు చెందినవారుగా భావిస్తున్నారు.
బోటు సర్వీసులన్నీ నిలిపి వేయాలన్న ముఖ్యమంత్రి..!
బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తక్షణం నదుల్లో తిరిగే అన్ని బోటు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశింంచారు. లైసెన్సులు తనిఖీ చేయాలన్నారు. సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. 2018 మే 16వ తేదీని పోలవరం మండలం వాడపల్లి వద్ద లాంచీ మునిగిన ఘనటలో 22 మంది మృతి చెందారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్… మృతులకు రూ. పాతిక లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ హత్యలన్నీ సర్కారీ హత్యలని నిందించారు.